2026 లో ఎబోలా వైరస్: ఎవరూ చెప్పని కొన్ని షాకింగ్ నిజాలు

You are currently viewing 2026 లో ఎబోలా వైరస్: ఎవరూ చెప్పని కొన్ని షాకింగ్ నిజాలు

అది శరీరంలోకి ప్రవేశించిన తర్వాత 21 రోజుల పాటు ఎటువంటి లక్షణాలు చూపించకుండా నిశ్శబ్దంగా ఉండగలదు. కొన్ని రకాలలో 90% మంది ప్రాణాలను తీయగలదు. అయినప్పటికీ ఈ వైరస్ అసలు ఎక్కడ నివసిస్తుందో శాస్త్రవేత్తలకు ఇంకా పూర్తిగా తెలియదు. అదే ఎబోలా వైరస్.

2026 మే 17న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC), ఉగాండాలో వ్యాపిస్తున్న బుండిబుగ్యో ఎబోలా అవుట్‌బ్రేక్‌ను అంతర్జాతీయ అత్యవసర పరిస్థితి (PHEIC)గా ప్రకటించింది. [1]

ఎబోలా వెనుక ఉన్న రహస్యాలు

సహజ నివాసం — ఇంకా రహస్యమే: ఎబోలా వైరస్ ఏ జంతువులో నివసిస్తుందో శాస్త్రవేత్తలకు ఇంకా నిర్ణయాత్మకంగా తెలియదు. గబ్బిలాలే ఈ వైరస్ తొలి నివాసం అని విస్తృతంగా అనుమానిస్తున్నారు. [2] తాజా పరిశోధనలు Mops condylurus అనే గబ్బిలం జాతి ఈ వైరస్‌ను 150 రోజుల పాటు రోగ లక్షణాలు లేకుండా మోయగలదని నిరూపించాయి. ఇది ఈ జాతి సహజ ఆశ్రయదాత  అయ్యే అవకాశం ఉందని సూచిస్తోంది. [3]

50 సంవత్సరాల చరిత్ర: ఎబోలా వైరస్ మొదటిసారిగా 1976లో అప్పటి జైర్ (నేటి DRC) లోని ఎబోలా నది సమీపంలో గుర్తించారు. ఆ గ్రామానికి కళంకం కలగకుండా ఉండాలని నది పేరు మీదే వైరస్ పేరు పెట్టారు. [4] 2026 నాటికి ఇది DRC లో 17వ ఎబోలా అవుట్‌బ్రేక్. [5]

సైలెంట్ పీరియడ్: వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత 2 నుంచి 21 రోజుల వరకు లక్షణాలు కనిపించవు. సగటు 6–10 రోజులు ఈ సైలెంట్ పీరియడ్ ఉంటుంది. [6]  అలాగే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే లక్షణాలు బయటపడే వరకు వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. [7]

వైద్య సిబ్బందికి పెను ముప్పు: 2014–2016 పశ్చిమ ఆఫ్రికా అవుట్‌బ్రేక్ లో 838 మంది వైద్య సిబ్బంది ఈ వైరస్ బారిన పడగా, 495 మంది ప్రాణాలు కోల్పోయారని WHO నివేదించింది. రోగులకు సేవ చేసే వైద్యులు, నర్సులు అత్యంత అధిక ప్రమాదంలో ఉంటారు. [8]

ప్రమాదకరమైన స్ట్రెయిన్స్: ఎబోలాలో ఐదు రకాలు ఉన్నాయి: Zaire, Sudan, Bundibugyo, Taï Forest, మరియు Reston. వాటిలో Zaire స్ట్రెయిన్ అత్యంత ప్రమాదకరమైనది. ఇందులో సరైన చికిత్స లేకపోతే 90% వరకు మరణాలు సంభవించవచ్చు. [9] ప్రస్తుతం వ్యాపిస్తున్న Bundibugyo స్ట్రెయిన్ మరణాల రేటు 30–50% మధ్య ఉంటుందని WHO చెప్తోంది. [10]

ఎబోలా అంటే ఏంటి?

ఎబోలా వైరస్ వ్యాధి అనేది మనుషులతో పాటు కోతులు, గబ్బిలాలు లాంటి క్షీరదాలను సోకే ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్. ఇది ఫిలోవిరిడే అనే ప్రత్యేక వైరస్ కుటుంబానికి చెందింది. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వేగంగా కణాలను నాశనం చేయడం ప్రారంభిస్తుంది, దీనివల్ల అవయవాలు దెబ్బతింటాయి. [11]

ఎబోలా ఎలా వ్యాపిస్తుంది — అపోహలు vs వాస్తవాలు

ఎబోలా వ్యాపించని మార్గాలు:

  • గాలి ద్వారా లేదా దగ్గడం/తుమ్మడం వల్ల ఎబోలా వ్యాపించదు. [7]
  • కేవలం కరచాలనం లాంటి సాధారణ స్పర్శ వల్ల సోకదు.
  • దోమలు లేదా ఇతర కీటకాల ద్వారా కూడా రాదు.

ఎబోలా వ్యాపించే మార్గాలు:

  • ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి రక్తం, లాలాజలం, చెమట, వాంతి, మలమూత్రాల వంటి శరీర ద్రవాలు మన శరీరానికి తగిలినప్పుడు. [6]
  • రోగి వాడిన బట్టలు, సూదులు, వైద్య పరికరాలను తాకడం వల్ల.
  • అడవిలో చనిపోయిన జంతువులను తాకడం లేదా సరిగ్గా ఉడికించని మాంసం తినడం వల్ల.

గుర్తుపట్టాల్సిన లక్షణాలు

ఎబోలా లక్షణాలు చాలా అకస్మాత్తుగా బయటపడతాయి. CDC ప్రకారం రెండు దశలుగా వచ్చే లక్షణాలు: [12]

మొదటి దశ లక్షణాలు:

  • అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం
  • విపరీతమైన అలసట, నీరసం
  • కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు
  • తీవ్రమైన తలనొప్పి, గొంతు నొప్పి

రెండవ దశ లక్షణాలు:

  • వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి
  • చర్మంపై ఎర్రటి దద్దుర్లు
  • కిడ్నీలు, లివర్ పనితీరు తగ్గడం
  • తీవ్రమైన కేసులలో రక్తస్రావం

గమనిక: ఈ లక్షణాలు మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులను పోలి ఉంటాయి. నిర్ధారణకు ప్రత్యేక పరీక్షలు అవసరం. [12]

ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్స

ప్రస్తుతం వ్యాపిస్తున్న Bundibugyo స్ట్రెయిన్ కు ఎటువంటి గుర్తింపు పొందిన వ్యాక్సిన్లు లేదా నిర్దిష్ట చికిత్సలు లేవు. [1] Zaire స్ట్రెయిన్ కు మాత్రం ERVEBO వ్యాక్సిన్ మరియు mAb114, REGN-EB3 అనే ప్రతిరోధక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. [13] ఏ స్ట్రెయిన్ కైనా ముందే చికిత్స ప్రారంభిస్తే, సరైన సపోర్టివ్ కేర్  అందిస్తే బతికే అవకాశాలు మెరుగుపడతాయి.

ఎబోలా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • DRC, ఉగాండాకు అత్యవసరమైతే తప్ప ప్రయాణించకపోవడం మంచిది. [5]
  • క్రమం తప్పకుండా సోప్‌తో చేతులు కడుక్కోవడం, ఆల్కహాల్ శానిటైజర్ వాడటం.
  • అనారోగ్యంతో ఉన్నవారితో లేదా మృతదేహాలతో దూరంగా ఉండటం.
  • అడవి జంతువుల మాంసాన్ని పూర్తిగా నివారించడం.
  • ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన తర్వాత 21 రోజుల పాటు ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవాలి. జ్వరం లేదా నీరసం కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. [14]

సమాజంలో ఉన్న అపోహలు

ఎబోలా గాలి ద్వారా వస్తుందని భయపడటం తప్పు. నిజానికి వ్యాధి ఉన్న వ్యక్తి శరీర ద్రవాలు నేరుగా మన శరీరంలోకి చేరితేనే వ్యాపిస్తుంది. అలాగే ఆఫ్రికా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఎబోలా ఉంటుందని అనుకోవడం కూడా తప్పు.అది కేవలం ప్రభావిత ప్రాంతాల్లో నిర్దిష్ట ప్రాంతాలలో  మాత్రమే ఈ ఇన్ఫెక్షన్ ఉంటుంది.

గతంలో వచ్చిన అవుట్‌బ్రేక్‌ల నుంచి పాఠాలు

2014–2016 మధ్య పశ్చిమ ఆఫ్రికాలో వచ్చిన ఎబోలా అవుట్‌బ్రేక్ చరిత్రలో అతి పెద్దది. అప్పుడు 28,652 మందికి ఇన్ఫెక్షన్ సోకగా, 11,325 మంది ప్రాణాలు కోల్పోయారు. [15] ఈ సంఘటన ప్రపంచ ఆరోగ్య వ్యవస్థల లోపాలను బయటపెట్టింది అలాగే WHO Health Emergencies Programme ఏర్పాటుకు దారితీసింది.

పర్యావరణం మరియు ఎబోలా సంబంధం

అడవులను నరకడం ఎబోలా వ్యాపించడానికి అతిపెద్ద ప్రమాద కారకం అని పరిశోధనలు చెప్తున్నాయి. [16] అడవులు నష్టపోవడం వల్ల వన్యప్రాణులు మనుషుల ప్రాంతాలకు దగ్గరవుతాయి, దీనివల్ల జంతువుల నుంచి మనుషులకు వైరస్ వ్యాపించే అవకాశాలు పెరుగుతాయి. [17] పర్యావరణాన్ని కాపాడటం మహమ్మారులను నివారించే ఒక ముఖ్యమైన మార్గం.

మన దేశంలో ఎబోలా ముప్పు చాలా తక్కువ. అయినా సోషల్ మీడియా వార్తలను నమ్మకుండా WHO వంటి ప్రామాణిక వనరుల సమాచారాన్ని మాత్రమే అనుసరించడం మన బాధ్యత. సురక్షితంగా ఉండండి, అవగాహన పెంచుకోండి!

References 

[1] World Health Organization (2026). Ebola disease caused by Bundibugyo virus — DRC. WHO Disease Outbreak News. https://www.who.int/emergencies/disease-outbreak-news/item/2026-DON602

[2] Riesle-Sbarbaro SA et al. (2024). Selective replication and vertical transmission of Ebola virus in experimentally infected Angolan free-tailed bats. Nature Communications, 15, 925. https://www.nature.com/articles/s41467-024-45231-0

[3] Bokelmann M et al. (2021). Tolerance and Persistence of Ebola Virus in Primary Cells from Mops condylurus. Viruses, 13(11), 2186. https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC8622823/

[4] Johnson KM & Breman JG (2016). Discovery and Description of Ebola Zaire Virus in 1976. Journal of Infectious Diseases, 214(Suppl 3): S93–S101. https://pubmed.ncbi.nlm.nih.gov/27357339/

[5] Centers for Disease Control and Prevention (2026). CDC Mobilizes International Response Following Ebola Disease Outbreak in DRC and Uganda. CDC Newsroom. https://www.cdc.gov/media/releases/2026/cdc-mobilizes-international-ebola-response.html

[6] European Centre for Disease Prevention and Control (2023). Factsheet about Ebola disease. ECDC. https://www.ecdc.europa.eu/en/infectious-disease-topics/ebola-disease/disease-information/factsheet-about-ebola-disease

[7] UK Health Security Agency (2026). What is Ebola and how does it spread? UKHSA Blog. https://ukhsa.blog.gov.uk/2026/05/18/what-is-ebola-and-how-does-it-spread/

[8] Fox M (2015). Ebola Kills Nearly 500 Health Care Workers. NBC News. (WHO confirmed: 838 infected, 495 died as of Jan 4, 2015.) https://www.nbcnews.com/storyline/ebola-virus-outbreak/ebola-kills-nearly-500-health-care-workers-n281801

[9] Bausch DG & Schwarz L (2014). Outbreak of Ebola Virus Disease in Guinea: Where Ecology Meets Economy. PLOS Neglected Tropical Diseases, 8(7): e3056. https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC4117598/

[10] CBS News / WHO (2026). Ebola strain in Congo-Uganda outbreak has no vaccine or treatment. (WHO: Bundibugyo fatality rate 30–50%, Zaire up to 90%.) https://www.cbsnews.com/news/ebola-outbreak-bundibugyo-congo-uganda-vaccine-treatment-symptoms/

[11] Centers for Disease Control and Prevention (2024). Ebola Disease Basics. CDC. https://www.cdc.gov/ebola/about/index.html

[12] Centers for Disease Control and Prevention (2024). Signs and Symptoms of Ebola Disease. CDC. https://www.cdc.gov/ebola/signs-symptoms/index.html

[13] World Health Organization (2025). Ebola — Treatment and Vaccines. WHO Health Topics. https://www.who.int/health-topics/ebola

[14] Centers for Disease Control and Prevention (2026). Ebola Disease Outbreak in DRC and Uganda — HAN Notice. https://www.cdc.gov/han/php/notices/han00530.html

[15] Ssentongo P et al. (2024). The west Africa Ebola virus disease outbreak: 10 years on. The Lancet Global Health. https://www.thelancet.com/journals/langlo/article/PIIS2214-109X(24)00129-3/fulltext

[16] World Wildlife Fund. Zoonotic Diseases and Deforestation. WWF. https://www.worldwildlife.org/our-work/forests/disease-and-deforestation/

[17] Olivero J et al. (2017). Recent loss of closed forests is associated with Ebola virus disease outbreaks. Scientific Reports, 7, 14291. https://www.nature.com/articles/s41598-017-14727-9