తీపి మధురమే! అతిగా తింటే మాత్రం ప్రమాదమే !

You are currently viewing తీపి మధురమే! అతిగా తింటే మాత్రం ప్రమాదమే !

మన ఆరోగ్యంలో ప్రతీ రుచికీ ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. ఇక ఇందులో తీపి మనందరికీ బాగా ఇష్టమైనది! తీపి అంటే కేవలం పంచదార మాత్రమే కాదు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలన్నీ మనం తీపి పదార్థాలనే అంటాం. సింపుల్ గా చెప్పాలంటే మనం తిన్న తరువాత జీర్ణం అయ్యి గ్లూకోస్ గా మారే ఆహార పదార్థాలన్నీ మధుర పదార్థాలే.. 

పంచదార, బెల్లం మొదలుకొని పాలు,వెన్న, నెయ్యి, వరి బియ్యం, బార్లీ, దోసకాయలు, పుచ్చకాయలు, సొరకాయలు, ఖర్జూరం, ద్రాక్షపండు, కొబ్బరికాయ, తేనె,చెరుకు ఇలా ఎన్నో తీపి పదార్థాలు మన రోజులో భాగం అయిపోయాయి. వీటి వల్ల మనకు జరిగే మంచీ ఉంది, చెడు కూడా ఉంది. ఆ మంచి చెడుల గురించి ఇది పూర్తిగా చదివి తెలుసుకోండి.

తీపి చేసే మంచి ఏంటంటే మన శరీరాన్ని పోషించడమే ! ఈ తీపి అనేదే లేకపోతె అసలు శరీరానికి సరైన నిర్మాణం లేదు, సరైన పోషణ కూడా ఉండదు. ఈ తీపి రుచి చేసే మంచి గురించి ఆయుర్వేదంలో  చెప్పబడింది. 

 

తీపి చేసే మేలు

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తీపి అనేది మన కంటికి మేలు చేస్తుంది, అలాగే మన వెంట్రుకలు పెరగడానికి, ధృడంగా ఉండటానికి కూడా తీపి కావాలి. అలాగే మనకు రోజంతా ఉత్సాహంగా ఉండే ఎనర్జీ కోసం, సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడం కోసం కూడా తీపి మనకు అవసరం.ఇంకా మన శరీర రంగు, చర్మ మృదుత్వం, కంఠంలో మంచి స్వరం, మనసుకు సంతృప్తి ఇలా అన్నిటి కోసం మనం తినే తీపి మనకు సహకరిస్తుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తుల విషయం పక్కన పెడితే, మిగతా వారికి ఈ తీపి అనేది వాత వ్యాధులు, కీళ్ళ నొప్పులు, కండరాలకు సంబంధించిన సమస్యలు వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగించగలదు. అందుకే అన్నారేమో మన శరీరాన్ని తీపి పోషిస్తుంది అని. మరి ఇన్ని మంచి విషయాలున్న తీపి గురించి ఎందుకు మనం ఎక్కువగా చెడుగా వింటున్నాం కదా! ఎందుకు? 

 

తీపి మితి మీరితే జరిగే ప్రమాదాలు 

ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. మనం ఏ స్వీట్ తినకపోయినా, పంచదార ముట్టుకోకపోయినా మన శరీరానికి కావలసిన తీపి మనకు మన ఆహారం ద్వారా అందుతుంది. మనం ఆహారంలో ఈ తీపినే ఎక్కువగా తీసుకొని, పైనుండి స్నాక్స్ పేరుతో, కేక్స్ పేరుతో మరింత తీపి తినడం వల్లే ఇప్పుడు మన తరం అనుభవిస్తున్న ఊబకాయం మరియు మధుమేహం వంటి సమస్యలన్నీ వస్తున్నాయి. తీపి ఆరోగ్యానికి గొప్పదే కానీ అతిగా తింటే ఏదైనా మనకు విరుద్ధంగా పనిచేయక మానదు. 

తీపి అధికంగా తింటే వచ్చే సమస్యలలో కఫ దోషం సమస్యలు కొని తెచ్చి పెట్టేంత స్థాయిలో పెరగటం. దీని వల్ల శరీర దోషాల సమతుల్యం తప్పి అనారోగ్యానికి శరీరం దారినిస్తుంది.

ఈ తీపి అధికంగా తినడం అనేది బరువు పెరగడం, అతినిద్ర, ఆకలి తగ్గిపోవడం, జీర్ణ వ్యవస్థ బలహీనం అవ్వడం వంటి సమస్యలు మొదలుకొని క్యాన్సర్ గడ్డలు ఏర్పడే దాకా ఎన్నో అనారోగ్యాలకు కారణం అవుతుంది. ఒకప్పుడు మన పూర్వికులు తినే ఆహారానికీ, వారు చేసే శారీరక శ్రమకు ఒక బ్యాలెన్స్ ఉండేది కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. 

మరి మన సంగతేంటి! వారి కంటే రెండింతలు తీపి తిని, వారి శారీరక శ్రమలో పది శాతం కూడా మనకు ఉండట్లేదు. అందుకనే మనం తినే తీపి అధికమవుతుంది, సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఒక్క సారి మన శరీరానికి మనం ఇచ్చే శ్రమను, మనం రోజులో తినే తీపి వల్ల వచ్చే క్యాలరీలను లేక్కలేసి చూసుకుంటే మనం ఎంత ఎక్కువగా తింటున్నామో మనకు అర్థమవుతుంది. 

 

చివరిగా చెప్పేదేమిటంటే..

ఇక మీదటైనా ఆలోచించండి, ఆహార విషయంలో సరైన ఎంపికలు ఎంచుకోండి. మనకు ఇష్టమైన తీపిని కూడా మనకు హాని చేయనంత మోతాదులో తినడానికి ప్రయత్నించండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి పునర్జన్ ఆయుర్వేద బ్లాగ్ ను ఫాలో అవ్వండి.