విటమిన్ K2 ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో మీకు తెలుసా?

You are currently viewing విటమిన్ K2 ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో మీకు తెలుసా?

అసలు విటమిన్లు అంటే ఏంటి అని ఒకసారి పరిశీలిస్తే, అవి మన ఆరోగ్యానికి, శరీర పనితీరుకు అవసరమైన ఒక ఆర్గానిక్ సమ్మేళనాలు. సహజంగా దొరికే ఆహార పదార్థాల ద్వారా వీటిని తక్కువ పరిమాణంలో రోజూ మనము తీసుకుంటాము.

విటమిన్లు గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం…

విటమిన్లు రెండు రకాలు:

  • నీటిలో కరిగే విటమిన్లు (water-soluble)
  • కొవ్వులో కరిగే విటమిన్లు (Fat-soluble)

కొవ్వులో కరిగే విటమిన్లు

ఇవి నాలుగు, అవే విటమిన్ A, D, E, K. ఇవి కొవ్వులోనే కరుగుతాయి. ఈ విటమిన్లను మన మానవ శరీరం కాలేయం, కొవ్వు కణజాలంలో నిల్వ చేస్తుంది. కాబట్టి ఇది చాలా కాలం పాటు నిల్వ చేయబడుతుంది. మనం తీసుకునే కొవ్వు పదార్థాల ద్వారా మన శరీరంలోని ప్రేగుల ద్వారా ఈ విటమిన్లను గ్రహిస్తుంది.

నీటిలో కరిగే విటమిన్లు

విటమిన్ B (B1, B2, B3, B5, B6, B7, B9, B12) మరియు విటమిన్ C ని నీటిలో కరిగే విటమిన్లు అని అంటారు. ఈ రెండింటిని కలిపి B-కాంప్లెక్స్ విటమిన్లు అని అంటారు.

ఈ విటమిన్లు మానవ శరీరంలో నిల్వ ఉండవు. అవి నిరంతరం మూత్రం ద్వారా తొలగించబడతాయి. కాబట్టి కొవ్వులో కరిగే విటమిన్ల కంటే మనము నీటిలో కరిగే విటమిన్లను ఆహారం ద్వారా ఎక్కువగా తీసుకోవాలి.

ఇప్పుడు విటమిన్ K మన ఆరోగ్య సంరక్షణలో ఎటువంటి పాత్ర పోషిస్తుందో తెలుసుకుందాం…

విటమిన్ K

ఈ విటమిన్ని 1929 లో కనుగొన్నారు. సాధారణంగా విటమిన్ K లోని ‘K’ అక్షరం జర్మన్ పదం ‘Koagulation’ నుంచి తీసుకున్నారు. ఇది రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది.

విటమిన్-K రెండు రూపాల్లో లభ్యమవుతుంది.

  • విటమిన్ K1 (ఫిల్లోక్వినోన్): ఆకు కూరలలో ఎక్కువగా దొరుకుతుంది.
  • విటమిన్ K2 (మెనాక్వినోన్): ఇది పులియబెట్టిన ఆహారాలు, జంతు ఆధారిత ఆహారాలలో లభిస్తుంది. వీటి ద్వారా మన గట్ బ్యాక్టీరియా మెరుగ్గా ఉత్పత్తి చేయబడుతుంది.

విటమిన్ K2 కి అనేక ఉప రకాలు ఉనాయి. అందులో MK-4 మరియు MK-7 చాలా ముఖ్యమైనవి.

విటమిన్ K2 ప్రయోజనాలు

ఆస్టియోపొరోసిస్ వ్యాధిని నివారణ:

విటమిన్ K2 మన శరీరంలోని ఎముకలలోని కాల్షియం డిపాజిషన్ మరియు కాల్షియం మెటబాలిజంలో సహాయపడుతుంది. కాల్షియం డిపాజిషన్ కారణంగా ఎముకలకు బలాన్ని ఇస్తుంది. ఇది ఆస్టియోపొరోసిస్ వ్యాధిని నిరోధిస్తుంది. ఈ వ్యాధిలో ఎముకలు పెళుసుగా మారి, ఎముకల ఫ్రాక్చర్ లకు దారితీయవచ్చు.

కాల్షియం సప్లిమెంట్లు కూడా ఎముకలలో కాల్షియం డిపాజిషన్ కు అంత సహాయపడవు. అలాగే హృదయ సంబంధిత సమస్యలకు గురి చేస్తుంది. ఈ విటమిన్ K2 ఎముకలలో కాల్షియం డిపాజిషన్ సరిగ్గా జరగడానికి సహాయపడుతుంది. కావున విటమిన్ K2 ని విటమిన్ D3 కలయికతో సప్లిమెంట్ల రూపంలో తీసుకోవడం జరుగుతుంది. ఇది మెరుగైన ఫలితాలను ఇస్తుంది.

ఈ విటమిన్ K2 రెండు కాల్షియం బైండింగ్ ప్రోటీన్లు అయిన మ్యాట్రిక్స్ GLA ప్రోటీన్ మరియు ఆస్టియోకాల్సిన్లను ఆక్టివేట్ చేస్తుంది. ఎముకలను దృడంగా నిర్మించడంలో మరియు నిర్వహించడంలో మార్గనిర్దేశం చేస్తుంది.

జపాన్ వారు జరిపిన ఒక అధ్యయనంలో విటమిన్ K2 సప్లిమెంట్లు ఆస్టియోపొరోసిస్ వ్యాధిని నిరోధించాయని, 77% హిప్ ఫ్రాక్చర్లను, 60% వెన్నెముక ఫ్రాక్చర్లను, 81% వెన్నెముకకు కాని ఫ్రాక్చర్లను తగ్గించాయని వెల్లడయ్యింది. అందువల్ల ఆస్టియోపొరోసిస్ వ్యాధి చికిత్స కోసం జపాన్ లో విటమిన్ K2 సప్లిమెంటేషన్ అధికారికంగా సిఫార్సు చేస్తున్నారు.

గుండె సమస్యల నివారణ:

ముందు చెప్పినట్లుగా, విటమిన్ K2 ఎముకలలో సరైన కాల్షియం డిపాజిషన్ పద్దతికి సహాయపడుతుంది. కాబట్టి ధమనుల వంటి ఇతర ప్రదేశాల నుండి కాల్షియంను తొలగిస్తుంది. ఇది రక్త ప్రసరణలో రక్తం గడ్డకట్టే ప్రక్రియను తొలగించడానికి కూడా సహాయపడుతుంది.

ధమనుల ఇన్నర్ లైనింగ్ లోని కాల్షియం డిపాజిట్ ద్వారా ప్లాక్ (Plaque) ఏర్పడటానికి దారితీస్తుంది. ఇది ధమనులను గట్టిపడేలా చేస్తుంది. ఈ పరిస్థితిని అథెరోస్క్లెరోసిస్ అని పిలుస్తారు. ఇది కరోనరీ హార్ట్ డిసీజ్ కు దారితీస్తుంది.

మెనాక్వినోన్ (విటమిన్ K2) తీసుకోవడం వల్ల కరోనరీ హార్ట్ డిసీజ్ ను నివారించవచ్చని 2020లో జరిగిన అధ్యయనం మనకు తెలియచేస్తుంది.

దంత క్షయ నివారణ:

విటమిన్ K2 దంతాలలో కాల్షియం డిపాజిట్ కు సహాయపడుతుంది. అలాగే దంత క్షయాలను తగ్గిస్తుంది.

విటమిన్ K2 ఆస్టియోకాల్సిన్ ప్రోటీన్ ను ఆక్టివేట్ చేయడం వల్ల కొత్త డెంటిన్ ను తయారు చేయడాన్ని పెంచుతుంది. డెంటిన్ అనేది దంతాల ఎనామెల్ క్రింద ఉండే కాల్సిఫైడ్ కణజాలం.

2023లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, విటమిన్ K2 ని తీసుకోవడం వల్ల మగవారిలో పేరియోడాంటల్ (Periodontal) వ్యాధి వల్ల జరిగే దంత నష్టాన్ని నివారిస్తుంది.

క్యాన్సర్ నివారణ:

విటమిన్ K2 కాలేయ క్యాన్సర్ పునరావృతం కాకుండా నిరోధించడంలో సహాయపడుతుందని మరియు సర్వైవల్ రేటును పెంచడంలో ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుందని ఇటీవలి అధ్యయనం తెలుపుతుంది.

కొన్ని పరిశోధనా అధ్యయనాల ద్వారా విటమిన్ MK (K2 యొక్క ఉప రకం) ఎక్కువగా తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.

K2 అందించే పదార్థాలు

ఆహారం ద్వారా తీసుకునే విటమిన్ K1, విటమిన్ K2 గా మన శరీరంలో సహజంగా రూపాంతరం చెందుతుంది. సహజంగా విటమిన్ K కొవ్వులో కరిగే విటమిన్ కాబట్టి, కొవ్వు పదార్థాలు నుండి మాత్రమే ఈ విటమిన్ పొందవచ్చు.

అంతే కాకుండా వివిధ వనరుల నుండి కూడా విటమిన్ K2 ని పొందవచ్చు.

  • అధిక కొవ్వు ఉండే మాంసాహారాలు
  • వెన్న, జున్ను వంటి అధిక కొవ్వు పాల ఉత్పత్తులు
  • గుడ్డులో ఉండే పచ్చసొన
  • చికెన్ కాలేయం
  • మలుగు చేప (Eel Fish)
  • పులియబెట్టిన ఆహారాలు (Fermented foods)
    1. సౌర్క్రాట్ (Sauerkraut): ఇది పులియబెట్టిన క్యాబేజీ. ఇది పుల్లని రుచితో ఉంటుంది. మన రోగనిరోధక శక్తిని, గట్ట్ హెల్త్ ని పెంచుతుంది.
    2. నాట్టో (Natto): ఇది పులియబెట్టిన సోయాబీన్స్. ఇది జపనీయుల ప్రసిద్ధ వంటకం. </li>
  • ఈము ఆయిల్

మన ఆరోగ్య సంరక్షణలో మెరుగైన ఫలితాల కోసం విటమిన్ K2 ని తీసుకోవడం చాలా మంచిది. కాని ఈ విటమిన్ K2 సప్లిమెంట్లు, వాటి ఆహార పదార్థాల సరియైన మోతాదు కోసం వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.

Also Read: Passion Fruit: కాన్సర్ ని నివారించాలంటే ఈ పండు తినాల్సిందే