యుర్వేదంలో ఆరోగ్యమైన జీవితానికి మూడు మూల స్తంభాలుగా ఆహార, బ్రహ్మచర్య మరియు నిద్ర గా లిఖించబడ్డాయి. ఈ ఒక్క వాక్యం నిద్ర అనేది మన జీవితంలో ఎంత ముఖ్యమో నిరూపించటానికి సరిపోతుంది. కానీ ఇది మాత్రమే కాదు.
ఆనందం, దుఖం, బలం, బలహీనత, జ్ఞానం, అజ్ఞానం అలా జీవితం మొదలు నుండి మరణం దాకా అన్ని విషయాల్లోనూ నిద్ర పాత్ర ముఖ్యమైనదని ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పబడింది. ఇక మాడర్న్ సైన్స్ ప్రకారం చూస్తె సరైన ఆరోగ్యం కోసం, ఆహార అరుగుదల, సరైన బరువులో ఉండటానికి,రోగనిరోధకశక్తి పెరగటానికి అన్నిటికీ నిద్ర అవసరం. శరీరానికే కాదు మెదడుకు, మానసిక ఆరోగ్యానికి కూడా నిద్ర ప్రభావం ఉంటుంది.ఆయుర్వేదంలో నిద్ర ప్రాముఖ్యత గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం.
మనకు నిద్ర ఎందుకు కావాలి ?
సరైన ఆరోగ్యానికి సరైన నిద్ర అవసరం, అసలు సరైన నిద్ర అంటే ఎక్కువ సేపు నిద్రపోవటమో లేదా తక్కువ సమయం గాఢంగా నిద్రపోవటమో కాదు, తగినంత, శరీరానికి సరిపోయేంత నిద్ర పోవటం.
ఎంత సమయం నిద్రపోవటం మంచిదో వయసును బట్టి మారుతూ ఉంటుంది. అసలు నిద్ర అంటే రోజంగా అలసిపోయిన మనసుకు శరీరానికి తిరిగి మళ్ళీ చురుగ్గా పని చేయటానికి ఇచ్చే విశ్రాంతి లాంటిది. సెల్ ఫోన్ చార్జింగ్ అయిపోయాక చార్జింగ్ పెట్టేసి కాసేపు అలానే వదిలేస్తే మళ్ళీ ఎలా మునుపటిలా పనిచేస్తుందో మనిషి కూడా అంతే.. మనకు కూడా అలసిపోయాక చార్జింగ్ అవసరం..అదే నిద్ర.సెల్ ఫోన్ లో హార్డ్ వేర్ మరియు సాఫ్ట్ వేర్ ఉన్నట్టు మనకు శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ఉంటాయి. ఇక నిద్రపోకుండా ఒక దగ్గర కూర్చొని అదే విశ్రాంతి అనుకుంటే చార్జింగ్ పెట్టి స్విచ్ ఆన్ చేయనట్టే!
అసలు నిద్ర సరిగ్గా లేకుంటే వచ్చే సమస్యలేంటి?
ఆయుర్వేదం ప్రకారం చూస్తె నిద్ర ఎక్కువగా పోయినా, తక్కువగా పోయినా,పగటిపూట నిద్రించినా ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఒకవేళ పగటిపూట ఎక్కువగా నిద్రించినట్లయితే..
అలసట,తలనొప్పి అలాగే జీర్ణం సరిగ్గా అవ్వకపోవటం నుండి జాండీస్ మరియు మానసిక సమస్యల దాకా ఎన్నో సమస్యలు తలెత్తే అవకాశం ఉందట. ఊబకాయం తో ఉన్నవారు,కఫ సంబంధిత సమస్యలు ఉన్న వారు అసలు పగటిపూట నిద్రించకూడదు. వేసవి కాలం తప్ప వేరే ఏ కాలంలో పగలు నిద్రించినా ఇలాంటి సమస్యలకు అవకాశం ఉందని ఆయుర్వేదం చెబుతుంది.అలాగే ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏ సమయంలో అయినా విశ్రాంతి కోసం నిద్రించవచ్చు.
ఒకవేళ అతిగా లేక తక్కువగా నిద్రపోయినట్లయితే..
ఎక్కువగా పని చేయటం వల్ల కావచ్చు, మద్య[పానం వల్ల కావచ్చు లేదా అతిగా తినటం వల్ల కావచ్చు ఎక్కువగా లేక తక్కువగా నిద్రించినా కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, సరైన నిద్ర లేకపోవటం వల్ల ఎక్కువగా మానసిక సమస్యలు వస్తాయి. ఇక శరీరానికి బిపి,షుగర్, డిప్రెషన్ చివరికి హార్ట్ స్ట్రోక్ కూడా నిద్ర లేమి వల్ల వచ్చే అవకాశం ఉంది.అదే ఎక్కువగా నిద్రపోతే ముఖ్యంగా ఊబకాయం పొంచి ఉన్నట్టే.
మరి ఎంత సమయం నిద్ర పోవాలి?
సింపుల్ గా చెప్పాలంటే అది వయసు ను బట్టి మారుతుంటుంది. అప్పుడే పుట్టిన పిల్లలకు రోజుకు పదిహేడు గంటల వరకు నిద్ర అవసరం అదే పెద్ద వాళ్ళకైతే ఏడు నుండి తొమ్మిది గంటలు ఖచ్చితంగా కావాలి. ఇక టీనేజర్స్ కు ఎనిమిది నుండి పది గంటలు అవసరం అలాగే వయసైన వాళ్లకు ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర అవసరం. స్కూల్ కి వెళ్ళే పిల్లలకు కూడా తొమ్మిది నుండి పదకొండు గంటల నిద్ర అవసరమవుతుంది.
మరి ఈ రోజుల్లో మనం ఎందుకు సరిగ్గా నిద్రపోలేకపోతున్నాం?
కెఫిన్ అందరికీ తెలిసే ఉంటుంది, ఇది కాఫీ లో ఉంటుంది. ఈ కెఫిన్ తీసుకున్నపుడు మన శరీరం దాదాపు ఏడు నుండి ఎనిమిది గంటల దాకా నిద్ర రానివ్వదు. అది ఆ కెఫిన్ కి ఉన్న లక్షణం కానీ ఈ తరం లో కెఫిన్ కి మరో ప్రత్యామ్నాయం వచ్చింది. అదే సెల్ ఫోన్ !
మన శరీరంలో సాయంత్రం సూర్యాస్తమయం సమయం అవ్వగానే మెలటోనిన్ అనే ఒక హార్మోన్ విడుదల అవ్వటం మొదలవుతుంది, ఈ హార్మోన్ వల్లే మనకు నిద్ర వస్తుంది. ఆ సమయంలో మనం అధికమైన ఆర్టిఫిషియల్ లైట్ కి ఎక్స్పోజ్ అయితే అప్పుడు మన శరీరం కార్టిసోల్ అనే ఒక హార్మోన్ ని విడుదల చేసి మళ్ళీ యాక్టివ్ గా అయ్యేలా చేస్తుంది. ఈ కార్టిసోల్ వచ్చే నిద్రను రాకుండా చేస్తుంది.
మన సెల్ ఫోన్ నుండి వచ్చే బ్లూ లైట్ కార్టిసోల్ విడుదల చేసి నిద్ర సరిగ్గా లేకుండా చేస్తుంది,అందుకే సెల్ ఫోన్ ఈ తరానికి ఒక కెఫిన్ లాగా తయారైంది.
కొందరు రాత్రి మొత్తం మేల్కొనే ఉంటూ నేను నైట్ పర్సన్ ని అని చెబుతూ ఉంటారు,
రాత్రంతా మెలకువగా ఉండటానికి మనమేం నిశాచర జీవులం కాదు కదా ! నిశాచర జీవుల శరీరం రాత్రి యాక్టివ్ గా ఉండేలా తయారుచేయబడింది. కానీ శాస్త్రీయంగా మన శరీరాలు ఉదయం యాక్టివ్ గా ప్రొడక్టివ్ గా ఉండటానికి తాయారుచేయబడ్డాయి, మనకైతే సరైన సమయానికి సరైన నిద్ర మనకు అత్యంత ముఖ్యమైనది.
మరి సరిగ్గా నిద్ర పోవటానికి ఏం చేయాలి?
- ఒకవేళ ఇప్పటికే మీరు లేట్ గా నిద్రపోతున్నట్లయితే ఈ రోజు నుండి రోజు ఒక వారం పాటు అరగంట ముందుగానే పడుకోవటం మొదలుపెట్టండి, ఉదాహరణకు మీరు రోజు రాత్రి పన్నెండు గంటలదాకా మేల్కొని ఉంటున్నట్లయితే, ఈరోజు పదకొండున్నర కే పడుకోండి, రేపు పదకొండు గంటలకు,ఎల్లుండి పదిన్నరకు ఇలా తొమ్మిది గంటలకు పడుకునే దాకా తగ్గించుకొని,రోజూ తొమ్మిదింటికి పడుకునేలా మీ టైం టేబుల్ ను సెట్ చేసుకోండి.
- నిద్ర పోయే సమయానికి ఒక గంట ముందుగానే మొబైల్,టీ వి లాంటివి ఆఫ్ చేసేయండి, ఎలాంటి లైట్స్ లేకుండా చూసుకోండి.
- ఒక పది నిమిషాల పాటు నిద్ర సమయానికి ముందు కొబ్బరినూనె తో పాదాలకు, తలకు మసాజ్ చేయండి. ఇది ప్రశాంతమైన నిద్రకు సహాయపడుతుంది.
- వారానికి ఒక సారి ఎలేక్త్రిసిటీ ఫాస్ట్ చేసి చూడండి, అంటే ఆరోజు ఎలాంటి కృత్రిమమైన లైట్స్ ఉపయోగించకండి,ఫోన్స్,టివి ఇలాంటి వాటిని దూరంగా ఉంచి దీపపు కాంతిలో నిద్రపోండి.
- ప్రశాంతమైన నిద్రకోసం మన పెద్దలు ఎప్పటినుండో చెబుతున్న చిట్కా, గోరు వెచ్చని పాలు త్రాగటం, ఇది ప్రయత్నించి చూడండి.
ఇవన్నీ మీ ప్రశాంతమైన నిద్రకు సహాయపడతాయి. సరైన నిద్ర సరైన ఆరోగ్యానికి కారణమవుతుంది, సరైన ఆరోగ్యం సరైన జీవితానికి కారణమవుతుంది.