సహజంగా మనల్ని శక్తివంతులని చేసే ఆహారాలు

You are currently viewing సహజంగా మనల్ని శక్తివంతులని చేసే ఆహారాలు

మనం ప్రతీరోజు ఉదయం లేవగానే  ఈ రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అని అనుకుంటాము. కానీ కొన్నిసార్లు అది సాధ్యపడదు. పైగా అలసటగా, శక్తి విహీనంగా ఫీల్ అవుతుంటాము. కొన్ని సార్లు వీటికి పెద్ద కారణాలు కూడా లేకపోవచ్చు. అలాంటప్పుడు వెంటనే ఎనర్జీని పొంది శక్తివంతంగా మరియు ఉల్లాసంగా ఉండాలి అంటే, వీటిని వినియోగించాలి. అవేమిటంటే, 

క్వినోవా: 

quinoa

 • క్వినోవా అనేది అత్యంత పోషక విలువలను కలిగిన ఆహరం. దీంట్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. క్వినోవాలో  గ్లైసెమిక్ ఇండెక్స్(GI) తక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ లో షుగర్ లేవల్స్ ను పెంచకుండా నియంత్రించడంలో సహాయపడుతుంది.  
 • క్వినోవాను యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఖనిజాల యొక్క మంచి మూలం అని చెప్పవచ్చు. ఇతర ధాన్యాలతో పోలిస్తే క్వినోవాలో మెగ్నీషియం, ఐరన్, ఫైబర్ మరియు జింక్‌, ఫాస్పరస్ మరియు ఫోలేట్ అధికంగా ఉంటుంది. 
 • క్వినోవా లోని మెగ్నీషియం మనం తీసుకున్న ఆహరాన్ని ఎనర్జీగా మార్చడంలో సహాయపడుతుంది. 
 • క్వినోవాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.  
 • అంతేకాకుండా బరువు తగ్గటానికి మరియు బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. 
 • ఆయుర్వేద ప్రకారం క్వినోవాలోని ఐరన్ మరియు మెగ్నీషియం మూడు దోషాలను సమతుల్యం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అరటిపండ్లు:

banana

 • అరటిపండ్లలో విటమిన్ సి, B6, పొటాషియం మరియు మాంగనీస్‌తో పాటు ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. ఈ పోషకాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్రను పోషిస్తాయి. 
 • నీరసంగా అనిపించినప్పుడు అరటిపండుని తినడం ద్వారా తక్షిణ మరియు స్థిరమైన ఎనర్జీని పొందవచ్చు. కేవలం రెండు అరటిపండ్లు 90 నిమిషాలకు సరిపడా శక్తిని అందిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
 • అథ్లెట్స్ కి అరటిపండుని చిరు తిండిగా ఇస్తారట.దీన్ని బట్టి చూస్తే అరటిపండు ఎంత ఎనర్జీని ఇవ్వగలదో అర్థం చేసుకోవచ్చు. 
 • అంతేకాకుండా జీర్ణసమస్యలు మరియు మలబద్ధకంతో బాధపడే వారికి అరటిపండ్లు చక్కగా సహయపడతాయి. ఎందుకంటే వీటిలో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది అలాగే మలబద్ధకాన్ని నివారిస్తుంది. 
 • మరియు వీటిలో డోపమైన్ మరియు కాటెచిన్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు  ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి మరియు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ఇవి ధీర్ఘ కాలీక వ్యాధి నివారణలో కీలక పాత్ర పోషిస్తాయి.

నట్స్ మరియు సీడ్స్:

Nuts

మన రోజువారీ ఆహరంలో నట్స్ మరియు సీడ్స్ ని చేర్చుకోవడం వల్ల  బరువును నియంత్రించడంలో సహాయపడటమే కాకుండా, గుండె జబ్బులు మరియు మధుమేహం వంటి  దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి అద్బుతంగా పనిచేస్తాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. 

నట్స్‌లో విటమిన్లు E, B6, నియాసిన్ మరియు ఫోలేట్ మరియు మెగ్నీషియం, జింక్, ఐరన్, కాల్షియం, కాపర్, సెలీనియం, ఫాస్పరస్ మరియు పొటాషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. 

సీడ్స్ లో ఉండే ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ మరియు ఫైబర్ మన గ్రోత్ కి మరియు ఎనర్జీ చాలా ముఖ్యమైనవి. మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఐరన్ మరియు జింక్ వంటి ఖనిజాలు మన శరీరాలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. విటమిన్లు B1, B2, B3 మరియు E మన శరీర ఆరోగ్యాన్నిమెరుగుపరచడంలో కీలకమైనవి. సీడ్స్ లో యాంటీఆక్సిడెంట్లు అనే ప్రత్యేకమైన పదార్థాలు ఉంటాయి. ఇవి మనల్ని దీర్ఘకాలీక వ్యాధులైనటువంటి క్యాన్సర్, మధుమెహం మరియు గుండె జబ్బులు వంటి వ్యాధులను నివారిస్తాయి. 

ఆకు కూరలు:

Green herbs

ఆకు కూరలు ఎనర్జీకి అద్భుతమైన మూలమని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవి మనం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన వివిధ రకాల పోషకాలను అందిస్తాయి. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్లు మనం శరీరంలోని ఎనర్జీ కి గొప్ప వనరులని చెప్పవచ్చు. ఆకు కూరల్లో ప్రోటీన్, ఫైబర్ మరియు వివిధ రకాల విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్‌గా విచ్చిన్నం అయ్యి మన శరీరానికి కావాల్సిన ఎనర్జీ రూపంలో ఉపయోగించడబడతాయి.  

బచ్చలికూర మరియు బ్రోకలీ వంటి ఆకు కూరలు సంక్లిష్టమైన  కార్బోహైడ్రేట్‌లను కలిగి ఉంటాయి. అందువల్ల ఇవి మన శరీరంలో నెమ్మదిగా విచ్ఛిన్నమవుతాయి అలాగే స్థిరమైన శక్తిని కూడా అందిస్తాయి.

ఆకుకూరల్లో కార్బోహైడ్రేట్‌లతో పాటు, మన శరీరంలోని టిష్యూస్ ని నిర్మించడానికి మరియు మెరుగుపరచడానికి అవసరమయ్యే, అలాగే కండరాల పనితీరుకు సహయపడే ముఖ్యమైన మాక్రోన్యూట్రియెంట్ అయినటువంటి ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా వీటిలో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

సాధారణంగా, ఆకు కూరలనేవీ ఆరోగ్యకరమైన ఆహారంలో ముఖ్యమైన భాగం. ముఖ్యంగా ఇవి ఎనర్జీని అందించటానికి దోహదపడే వివిధ రకాల పోషకాలను అందించగలవు. రోజువారి ఆహరం ద్వారా మనకి కావాల్సిన అన్ని పోషకాలు అందేలా చూసుకోవడానికి ఆహారంలో వివిధ రకాల ఆకుకూరలను చేర్చుకోవడం ముఖ్యం. 

ఓట్స్:

Oat

ఒక ఉల్లాసమైన రోజును ప్రారంభించాలంటే ముందుగా మన ఆహారంలో తృణధాన్యాలను చేర్చుకోవాలి. కార్బోహైడ్రేట్లు మన శరీరానికి ఎనర్జీ గా పనిచేస్తాయి మరియు మన రోజువారీ ఆక్టివిటీస్ ను నిర్వహించడానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ఓట్స్ వంటి తృణధాన్యాలను తీసుకోవడం వలన మనకి మరింత స్థిరమైన శక్తి లభిస్తుంది. ఈ ధాన్యాలు నెమ్మదిగా జీర్ణమవుతాయి, ఉదయం అంతటా శక్తిని స్థిరంగా విడుదల చేస్తాయి. అదనంగా, ఓట్స్ లో నియాసిన్, థయామిన్ మరియు ఫోలిక్ యాసిడ్ వంటి ముఖ్యమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ముఖ్యమైన పోషకాలు మన శరీరంలో అద్బుతంగా పని చేస్తాయి. అందుచేత ఓట్స్ తో చేసుకునే రకరకాల ఆరోగ్యకరమైన ఆహరాలను చేర్చుకోవడం ఉత్తమమని అధ్యయనాలు చెబుతున్నాయి.  

గ్రీన్ టీ: 

సాధారణంగా మన దేశంలో చాలమందికి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు అంత మంచిదికాదని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాకాకుండా ఉదయంపూట గ్రీన్ టీని తాగితే రోజంతా ఉల్లాసంగా ఉండవచ్చు. ఇది మనల్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే మన మెదడు యొక్క పనితీరుని మెరుగుపరచడంతో పాటు, బరువు ను కంట్రోల్ లో ఉంచడానికి కూడా సహాయపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులను నివారించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇవి చక్కగా ఉపయోగపడతాయి. ప్రతిరోజూ మూడు నుండి ఐదు కప్పుల గ్రీన్ టీ తాగితే, మంచి ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సులభంగా చెప్పాలంటే, కొన్నిసార్లు మనం రోజంతా చూరుకగా ఉండటానికి తగినంత శక్తిని కలిగి ఉండాలని కోరుకుంటాము అలాంటి సందర్భాలలో గ్రీన్ టీ చక్కగా సహాయపడుతుంది. 

చాలామంది, నీరసంగా ఉన్నప్పుడు బయట దొరికే కృతిమ డ్రింక్స్ ను తాగడానికి మొగ్గు చూపుతుంటారు. అవి మన ఆరోగ్యానికి అంతా శ్రేష్టమైనవి కాదనే విషయం మనకి తెలిసిందే. అలాంటప్పుడు ఇలా సహజంగా శక్తిని అందించే ఆహరాలను తీసుకోవడం శ్రేయస్సు కరం.