భారతీయ సాంప్రదాయ ఆహారంలో అన్నం తినే అలవాటు వెనక ఉన్న సైన్స్!

You are currently viewing భారతీయ సాంప్రదాయ ఆహారంలో అన్నం తినే అలవాటు వెనక ఉన్న సైన్స్!

అన్నం పరబ్రహ్మ స్వరూపం !

మనం తినే అన్నాన్ని ఆ దేవుడితో పోల్చడానికి కారణం, మనందరి ఆకలి, అన్నం తీరుస్తుందని మాత్రమే కాదు.. అన్నం మనందరినీ ఆరోగ్యంగా ఉంచుతుందని కూడా..

అదేంటి, అన్నం ఎక్కువగా తినడం వల్లే అన్నీ అనారోగ్యం రాజ్యమేలుతుందనే ఇప్పటి సైన్స్ చెబుతుంటే,

మీరేమో అన్నం ఆరోగ్యానికి కారణం అని ఎలా అంటున్నారు అనేది మీ ప్రశ్న అయితే..

దానికి సమాధానంగా మీకు తెలియని మన భారతీయ అన్నం తినే అలవాటు వెనక ఉన్న సైన్స్ గురించి ఇది చదివి తెలుసుకోండి.

మనం తినే అన్నం ప్రస్తావన ఎప్పుడో ఏడు వేల ఏళ్ళ క్రితమే మొదలైంది. ప్రపంచంలో సగం జనాభా కి ఒకప్పుడు అన్నమే ముఖ్య ఆహారం. మన దేశంలో కూడా ఎన్నో వేల సంవత్సరాల నుండే అన్నం తింటూ వస్తున్నాం. ఈ అన్నం గురించి మన పురాణాల్లో కూడా చెప్పబడింది. మన వేదాల్లో కూడా రాయబడి ఉంది. మన భారతీయ వైద్య సంపద ఆయుర్వేద మహామహులైన చరకుడు, సుశ్రుతుడు వంటి వారు కూడా అన్నం ఉత్తమమైనదని, రక్తశాలీ రకమైన ధాన్యంతో వండిన అన్నం అన్నిటికంటే శ్రేష్ఠమైనదని చెప్పారు. ఆ అన్నం తింటే ఆరోగ్యంగా ఉండగలమట, అనారోగ్యాన్ని దూరంచేసే ఔషధంగా కూడా ఆ అన్నాన్ని భావించేవారట.

సరే..ఈ రక్తశాలీ ధాన్యమేంటి?

మేమంతా ఈ సన్నబియ్యం, బాస్మతీ తింటుంటే అని మీ సందేహం రావచ్చు.

ఇప్పుడు మనం తినే ధాన్యానికి ఒకప్పుడు మన పూర్వికులు తిన్న ధాన్యానికి నేలకు ఆకాశానికీ ఉన్నంత వ్యత్యాసం ఉంది. అందుకే ఇప్పుడు మన తరంలో పిల్లలకు తాతల పోలికలోస్తున్నాయి కానీ తాతల బలం రావట్లేదు.

ఈ రక్తశాలీ గురించి మీకు అర్థంకావాలంటే ముందు మన ప్రాచీన భారతీయులు మనం తినే అన్నాన్ని ఇచ్చే ధాన్యాలను ఎలా విభాజించారో తెలియాలి. ఇది మన భారతీయ జ్ఞాన సంపద, తెలుసుకోవడం మన బాధ్యత.

మన పూర్వికులు కాలాన్ని బట్టి ధాన్యం రకాన్ని నిర్ణయించేవారు. అప్పట్లో వేసవి కాలంలో పండే ధాన్యాన్ని శాస్తిక ధాన్యం అనే వారు, వర్షాకాలంలో పండే ధాన్యాన్ని వర్షిక లేదా వ్రిహి అనేవారు, ఇక శరదృతువులో పండే ధాన్యాన్ని శారద అని, చలికాలం లో పండే వాటిని హైమంతిక అనేవారు.

 ఈ హైమంతిక ధాన్యాలలో శాలి అనే రకమైన ధాన్యం ప్రధానమైనది. ఈ శాలి అనే ధాన్యంలో కూడా మహాశాలి,కలమ శాలి, రక్త శాలి అనే మూడు రకాల ధాన్యాలు ఉండేవి. వీటిలో మహాశాలి అనేది చాలా పెద్ద రకమైన ధాన్యం, ఇది మగధ రాజ్యంలో పండించేవారట. ఇక కలమ అనే ధాన్యం మంచి వాసనతో  తెల్లగా బాగా గట్టిగా ఉండేదట. 

ఇక రక్తశాలి అనే ధాన్యం అన్ని ధాన్యాలలోనూ ఉత్తమమైనది. ఎరుపు వర్ణంలో ఉంటూ అధిక పోషకాలు అందించే ధాన్యం ఇది. ఎన్నో ప్రాచీన గ్రంధాలలో ఈ రక్తశాలీ రకమైన ధాన్యం గురించి రాసి ఉంది.

ఇప్పుడు మనం మార్కెట్ లో కొనే నవారా బియ్యం శాస్తిక రకానికి చెందినది. అది అరవై నుండి డెబ్బై రెండు రోజులలో పండుతుంది. ఈ రక్తశాలీ బియ్యం పండటానికి నూటపది నుండి నూట ఇరవై రోజులు కావాలి.ఈ రెండూ రకమైన ధాన్యాలు మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచినే చేస్తాయి. దేని ప్రాధాన్యత దానిది. ఇక ఈ రక్తశాలీ ధాన్యం అనేది మన శరీరంలో త్రిదోశాలను సమతుల్యం చేయడంలో సహాయపడగాలదని మన ప్రాచీన భారతీయ జ్ఞానం చెబుతుంది. ఇక ఈ రక్తశాలీ ధాన్యంతో వండిన అన్నమే ఆరోగ్యానికి  మంచి చేసేలా పనిచేస్తుందంటే, ఈ అన్నంలో నెయ్యి కలిపితే అది ఔషధంలా మారుతుందని మన పూర్వీకుల మాట. 

అందుకే ఈ అన్నం పై నెయ్యి వేసి కలిపినపుడు ఇది ‘అన్నౌషధి’ గా మారుతుందట. అన్నంలో నెయ్యి కలిపినపుడు ఆ అన్నం గ్లుకోస్ స్పైక్ చేయదట ఎందుకంటే నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ అధిక బ్లడ్ షుగర్ ను సమతుల్యం చేస్తాయి, అంతేకాకుండా నెయ్యిలో ఉండే లీనోలిక్ యాసిడ్ హృదయ సంబంధిత వ్యాధులను నివారిస్తుందట.  ఇంతటి గొప్ప చరిత్ర మన భారతీయ సాంప్రదాయ ఆహారంలో అన్నానికి ఉంది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు.

ఇప్పుడు మనం తినే తెల్లటి పాలిష్ చేసిన బియ్యం లో తక్కువ ఫైబర్, తక్కువ పోషకాలు ఉండి గ్లుకోస్ మాత్రమే  అధికంగా ఉంటుంది. అందుకే ఇది అధికంగా తినగానే మన శరీరంలో గ్లూకోస్ స్పైక్ అవుతుంది, ఒకానొక సమయంలో డయాబెటిస్ కు దారితీస్తుంది. లక్ష రకాల వరి దాన్యాలున్న భారతదేశం, గ్రీన్ రేవల్యుషన్ మరియు హైబ్రిడైజేషన్ వంటి కారణాల వల్ల ఆ వైవిధ్యాన్ని కోల్పోయి  ఈ స్థాయి వచ్చింది. ఇప్పుడు దేశమంతా ఒకే రకమైన పోషకాలు లేని తెల్లటి అన్నం అధికంగా తిని అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం. 

మన తెల్లటి పాలిష్ చేసిన రైస్ లో లేని, 

రక్తశాలీ ధాన్యం లో ఉండే పోషక విలువలేంటో చూద్దాం.

ఈ రక్తశాలీ ధాన్యానికి రక్త అనే పేరు రావడానికి ఈ ధాన్యం రంగు ఎరుపు రంగులో ఉండటం మాత్రమే కారణం కాదు, ఇందులో ఉండే గుణాలు మన రక్తాన్ని శుద్ధి చేస్తాయి అనడానికి ఆ పేరు పెట్టారట. ఈ ధాన్యం తినడం వల్ల లివర్, కిడ్నీ సమస్యలు, జీర్ణసమస్యలు నివారించావచ్చట. ఈ రైస్ తక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ తో ఉండటం వల్ల డయాబెటీస్ ఉన్న వారు కూడా తినవచ్చు. ఇంకా ఇందులో ఉండే సెలీనియం, పాలీ ఫేనాల్ వంటి యాంటీఆక్సిడెంట్లు మరియు జింక్, ఐరన్, క్యాల్షియం వంటి పోషకాలు మనం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. ఇందులో విటమిన్-బీ అధికంగా ఉండటం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇన్ని పోషక విలువలు, ఔషధ గుణాలు ఉండటం వల్ల ఇది శ్రేష్ఠమైన ధాన్యంగా పిలవబడింది.

అలాగే  ఈ రక్తశాలీ  పంట ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకోగాలదట, దానికి ఉదాహరణగా 2018 లో కేరళలో వరి పంట రెండు రోజులు  నీట మునిగితే అక్కడ ఉన్న అన్ని రకాలలో ఒక రైతు వేసిన ఈ రక్తశాలి మాత్రమే నీట మునిగినా తట్టుకొని నిలబదిందట. కానీ ఇప్పుడు ఇది అంతరించిపోయే పరిస్థితిలో ఉంది, ఈ మధ్య ఆర్గానిక్ మరియు సాంప్రదాయ రకాలైన ధాన్యాలకు ప్రాధాన్యత పెరగడంతో కొందరు రైతులు దీనిని సాగు చేస్తూ మన సాంప్రదాయ సంపదను నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. 

మనం కూడా వాటిని ఎంచుకోవడానికి ప్రాధాన్య ఇస్తూ, వీటిని పండించే రైతులను ప్రోత్సహిద్దాం. 

మనందరం మన భారతీయ సాంప్రదాయ ధాన్యాలకు పూర్వ వైభవాన్ని ఇవ్వడంలో మన పాత్రను పోషిద్దాం ! మన ప్రాచీన జ్ఞాన సంపదను పంచుతూ, సాంప్రదాయ ఆహారాన్ని తింటూ, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం!

మీరు కూడా వీలయితే వారానికి ఒక సారైనా మన ఆరోగ్య సమస్యలను నివారించగలిగే ప్రాచీన ధాన్యాలైన నవార, రక్తశాలి వంటివి తినడానికి ప్రయత్నించండి. ఆరోగ్యాన్ని అందించే సరైన పోషకాలను మీ శరీరానికి మీరే బహుమతిగా ఇవ్వండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి పునర్జన్ ఆయుర్వేద బ్లాగ్ ను ఫాలో అవ్వండి.