క్యాన్సర్ పేషెంట్ జీవితకాలాన్ని నాలుగు రెట్లు పెంచగల వేగస్ నర్వ్..
మన శరీరానికి ఇంటర్నెట్ ప్రొవైడర్!
మనిషి శరీరాన్ని కూడా కంప్యూటర్ తో పోల్చి చూస్తే ఇందులో కూడా మనకు సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ కనిపిస్తాయి. మన శరీర అవయవాలన్నీ హార్డ్ వేర్ అనుకుంటే, ఇప్పుడు మనకు వచ్చే ఆరోగ్య సమస్యలను గుర్తించడానికి మనం చేసే పరీక్షలన్నీ హార్డ్ వేర్ విషయంలోనే ఉంటాయి. స్క్యాన్ కానీ, ఎక్స్ రే కానీ అన్నీ ఈ హార్డ్ వేర్ లో లోపాలను గుర్తించడానికే !
అలాగే మన శరీరంలోని నాడీ వ్యవస్థను మనం సాఫ్ట్ వేర్ అనుకుంటే, అందులో ఉండే వేగస్ నర్వ్ అనేది మన శరీరమంతా సిగ్నల్స్ పంపడానికి, మన బ్రెయిన్ ఆ సిగ్నల్స్ కు సమాధానాలు తిరిగి పొందడానికి సహాయపడే
ఇంటర్నెట్ ప్రొవైడర్ అవుతుంది. అంతే కాదు ఈ వేగస్ నర్వ్ పనితీరు క్యాన్సర్ విషయంలో కూడా ప్రభావం చూపుతుందని అధ్యాయనాలు చెబుతున్నాయి. క్యాన్సర్ తీవ్ర దశలో ఉన్న వారికి ఈ వేగస్ నర్వ్ పని తీరును బట్టి వారి జీవితకాలం నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉందట.
అసలు వేగస్ నర్వ్ అంటే ఏంటి?
ఇది ఎం పని చేస్తుంది?
దీనికి క్యాన్సర్ కి మధ్యలో ఉండే సంబంధమేంటి?
వేగస్ నర్వ్ ఎలా స్టిములేట్ చేయాలి? వంటి ప్రశ్నలకు సమాధానం కోసం ఇది పూర్తిగా చదవండి.
వేగస్ నర్వ్
మన నాడీ వ్యవస్థలో పన్నెండు జతల కపాల నాడులు ఇవి మన మెదడు నుండి ప్రారంభమవుతాయి. ఈ పన్నెండు జతల నాడులలో పదవది వేగస్ నర్వ్. ఈ నాడి ప్రత్యేకత ఏమిటంటే ఇది మన మెదడు నుండి స్వరపేటిక, వాయు నాళం, ఊపిరి తిత్తులు, గుండె , ఆహార నాళం, క్లోమ గ్రంధి, జీర్ణాశయం వరకూ అన్ని అవయవాలను ప్రభావితం చేసేలా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సహానుభూత పరనాడీ వ్యవస్థ లో ఈ వేగస్ నర్వ్ ముప్పావు వంతు పని చేస్తుంది.
వేగస్ నర్వ్ పనితీరు
సింపుల్ గా చెప్పాలంటే మన రుచి, మాట, చర్మ స్పందనలు, కండరాల స్పందనలు, రోగానిరోశక వ్యవస్థ స్పందనలు, బ్లడ్ ప్రెజర్, ఊపిరి వేగం, లాలాజలం, మ్యుకస్ ప్రొడక్షన్, జీర్ణక్రియ, మానసిక పరిస్థితి గురించిన విషయాలను మన మెదడుకు సిగ్నల్స్ లాగా పంపడం ఈ వేగస్ నర్వ్ పని. ఈ వేగస్ నర్వ్ కి సమస్య ఏర్పడింది అంటే డిప్రెషన్ కానీ లేదా ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్, ఎపిలిప్సీ వంటి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంది.
వెగస్ నర్వ్ పనితీరు సరిగ్గా లేకపోతే కనిపించే సంకేతాలు
యాసిడ్ రిఫ్లక్స్, పొత్తి కడుపు నొప్పి ,ఉబ్బరం, గాగ్ రిఫ్లెక్స్ లేకపోవడం,
మింగడం కష్టం అవ్వడం ,తలతిరగడం, మూర్ఛ, గొంతు బొంగురుపోవడం,గురక,
అకారణంగా బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, చాలా తక్కువ ఆహారం తీసుకున్న తర్వాత కడుపు నిండిన అనుభూతి, వికారం, వాంతులు, దీర్ఘకాలిక మానసిక సమస్యలు వంటివి వేగస్ నర్వ్ పనితీరు సరిగ్గా లేదని తెలిపే సంకేతాలు.ఈ వేగస్ నర్వ్ కి క్యాన్సర్ తో కూడా సంబంధం ఉంది.
వేగస్ నర్వ్ కి క్యాన్సర్ కి ఉన్న సంబంధం
సాధారణంగా క్యాన్సర్ శరీరంలో పెరగడానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉంటాయి. అందులో ఒకటి ఫ్రీ ర్యాడికల్స్ వల్ల వచ్చే ఆక్సిడేటివ్ స్ట్రెస్, రెండు ,ఇన్ఫ్లమేషన్ , మూడు అధిక సిమ్పతిటిక్ స్ట్రెస్. ఈ మూడు విషయాల పైనా వేగస్ నర్వ్ ప్రభావం ఉంటుంది. సాధారణంగా మనం ఊపిరి పీల్చినప్పుడు గుండె వేగం పెరుగుతుంది, మళ్ళీ ఆ శ్వాస వదిలినప్పుడు ఆ వేగం తగ్గుతుంది. ఈ ప్రక్రియను హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటారు. ఈ ప్రక్రియ సరిగ్గా జరిగితే వేగస్ నర్వ్ పనితీరు సరిగ్గా ఉంది అని అర్థం. ఈ హార్ట్ రేట్ వేరియబిలిటీనే వేగల్ టోన్ అని కూడా అంటారు.
ఈ వేగల్ టోన్ అధికంగా ఉన్నప్పుడు క్యాన్సర్ పెరుగుదల తగ్గుతున్నట్టు ఒక అధ్యాయనం తెలిపింది. చివరి దశ క్యాన్సర్ , మెటాస్టాటిక్ క్యాన్సర్ లో కూడా ఈ విషయం గమనించబడిందట. వేగల్ టోన్ తక్కువగా ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ తో పోలిస్తే వేగల్ టోన్ ఎక్కువగా ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ యొక్క సర్వైవల్ టైం నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉందట.
ఇంకా వేగస్ నర్వ్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను చూపించగలదు. వేగస్ నర్వ్ ఇన్ఫ్లమేషన్ పై చూపించే ప్రభావాన్ని ఇన్ఫ్లమేటరీ రిఫ్లెక్స్ అంటారు. ఈ నాడి ఇన్ఫ్లమేషన్ కు కారణం అయ్యే ప్రోటీన్ అయిన ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ను జెనిటిక్ లెవల్ లోనే నియంత్రిస్తుందట. తద్వారా ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. ఈ విధంగా వేగస్ నర్వ్ క్యాన్సర్ పై ప్రభావం చూపిస్తుంది
వేగస్ నర్వ్ ను ఎలా స్టిములేట్ చేయాలి?
మన వేగల్ టోన్ ను పెంచుకునే అవకాశం మనకు ఉంది. కోల్డ్ థెరపీ, ధ్యానం, స్లో-డీప్ బ్రీతింగ్, హమ్మింగ్,గట్ హెల్త్ ని కాపాడుకోవడం వంటివి మన వేగల్ టోన్ ని పెంచడంలో సహాయపడతాయి.
మన మెదడు మరియు గట్ ఎప్పడూ పరస్పరంగా కమ్యునికేట్ చేసుకుంటూ ఉంటాయి. ఆ సంబంధానికి కారణాలలో వేగస్ నర్వ్ కి కూడా భాగం ఉంది. అందుకని మన మెదడు ఆరోగ్యం కోసం గట్ ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. సరైన ప్రోబయోటిక్ మరియు ప్రీబయోటిక్ ఆహారం తీసుకుంటూ మన గట్ హెల్త్ ను కాపాడుకోవచ్చు. అలాగే విం-హాఫ్ థెరపీ గా పిలవబడే కోల్డ్ థెరపీ కూడా ఈ వేగల్ టోన్ ను పెంచాగలదట. చల్ల నీటి స్నానానికీ మరియు చల్లటి వాతావరణానికి అలవాటు పడుతూ అలాంటి ప్రదేశాలలో ప్రాణాయామం చేస్తే అది వేగస్ నర్వ్ ను స్టిములేట్ చేయగలదట. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కనీసం ముఖం చల్ల నీటితో కడిగినా కూడా కొంత వరకు లాభపడుతుందట.
వేగల్ టోన్ కోసం యోగా
ఎన్నో వేళ ఏళ్ల చరిత్రగల మన యోగా ఈ వేగల్ టోన్ ను పెంచగలదు. ధ్యానం, ప్రాణాయామం వంటివి వేగస్ నర్వ్ ను స్టిములేట్ చేయడంలో సహాయపడతాయి. స్లో డీప్ బ్రీతింగ్ ఉండే యోగా ప్రక్రియే భ్రమరీ ప్రాణాయామం. ఈ రకమైన ప్రాణాయామం చేయడం వల్ల మన వేగల్ టోన్ పెరుగుతుంది. ఈ ప్రక్రియలో శ్వాసను నెమ్మదిగా పీల్చి, ఝుంకార శబ్దంతో బయటకు వదలాల్సి ఉంటుంది. ఇలా రోజూ కొన్ని నిమిషాల పాటూ చేస్తూ వేగల్ టోన్ ను పెంచుకోవచ్చు. ఈ భ్రమరీ ప్రాణాయామం తో పాటూ శన్ముఖీ ముద్ర, అర్థ మత్స్యేంద్ర ఆసనం కూడా ఈ వేగస్ నర్వ్ స్టిములేట్ అవ్వడంలో సహాయం చేస్తుంది.
చివరగా చెప్పేదేమిటంటే,
వేగల్ టోన్ అనేది ఎక్కువగా ఉండటం మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. స్ట్రెస్ తగ్గడంలో, ఏదైనా ఆరోగ్య సమస్య తరువాత శరీరం రికవరీ త్వరగా అవ్వడానికి, అలాగే శరీరం మళ్ళీ రీచార్జ్ అవ్వడానికి ఈ వేగల్ టోన్ సహాయపడుతుంది. క్యాన్సర్ విషయంలో మాత్రమే కాకుండా సంపూర్ణ మానసిక శారీరక ఆరోగ్యం విషయంలో ఈ వేగస్ నర్వ్ స్టిములేట్.