మహిళల్లో వచ్చే 5 అత్యంత సాధారణ క్యాన్సర్లు

You are currently viewing మహిళల్లో వచ్చే 5 అత్యంత సాధారణ క్యాన్సర్లు

ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి చాలా విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. మహిళల్లో ప్రతీ ముగ్గురిలో ఒకరికీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ వ్యాధి ఇంత వేగంగా విస్తరించడానికి దీని పట్ల అవగాహన లోపం కూడా ఒక కారణం కావొచ్చు. క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండడటం వల్ల క్యాన్సర్ వ్యాధిని నివారించడానికి జాగ్రత్తలు తీసుకోడానికి ప్రేరేపిస్తుంది. అందువల్ల మహిళల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్లు ఏవి మరియు వాటిని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకునే ముందు క్యాన్సర్ అంటే ఏమిటో చూద్దాం. 

 

క్యాన్సర్ అంటే ఏమిటి..? 

క్యాన్సర్ అనేది శరీరంలోని డ్యామేజ్ అయిన కణాలు నియంత్రణ లేకుండా పెరిగి కణతులుగా ఏర్పడి, శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే వ్యాధి.   

 

మహిళల్లో సాధారంగా కనిపించే క్యాన్సర్లు:

 • బ్రెస్ట్ క్యాన్సర్
 • ఊపిరితిత్తుల క్యాన్సర్
 • కొలొరెక్టల్ క్యాన్సర్
 • గర్భాశయ క్యాన్సర్
 • అండాశయ క్యాన్సర్.

 

బ్రెస్ట్ క్యాన్సర్:

మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించేది బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రొమ్ములలో ఉండే కణాలలోని DNA డ్యామేజ్ అయ్యి నియంత్రణ లేకుండా పెరిగినప్పుడు ఏర్పడుతుంది. మొదటి దశలో గుర్తించి చికిత్స చేయకపోతే ఇది ఇతర భాగాలకు వ్యాపిస్తుంది.    

బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 

 • ఎప్పటికప్పుడు శరీర బరువును పరిశీలిస్తూ, అధిక బరువు పెరగకుండా  చూసుకోవాలి. 
 • గంటల తరబడి ఒకేచోట కూర్చోకుండా శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలి. ముఖ్యంగా వ్యాయామం,యోగా వంటివి అలవాటు చేసుకోవాలి.   
 • అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉంటూ, ఆహరంలో పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలి.  
 • అలాగే మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లను మానుకోవాలి. 
 • వీలైతే బాలింతలు తల్లిపాలను శిశువులకు పట్టించాలి. 
 • ముఖ్యంగా 35 యేళ్ళు పైబడిన వారు బర్త్ కంట్రోల్ పిల్స్ యొక్క వినియోగాన్ని  మానుకోవాలి. 
 • మెనోపాజ్ కోసం హార్మోన్ థెరపీని నివారించాలి.
 • టామోక్సిఫెన్ మరియు రాలోక్సిఫెన్ వంటి డ్రగ్స్ ను వినియోగించే వారికి బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 

 

ఊపిరితిత్తుల క్యాన్సర్

ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ఊపిరితిత్తుల కణజాలంలో మొదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా  మహిళల్లో క్యాన్సర్ సంబంధిత మరణాలకు అత్యంత సాధారమైన కారణాలలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా ఒకటి. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ధూమపానం ఒక ప్రమాద కారకం. అయినప్పటికీ, ధూమపానం చేయనివారు ప్యాసివ్ స్మోకింగ్ మరియు  పర్యావరణ కాలుష్య కారకాలు అలాగే జన్యుపరమైన కారణాల వల్ల కూడా ప్రభావితమవుతారు.

ఊపిరితిత్తుల క్యాన్సర్ ను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 

 • స్మోకింగ్ ను మానుకోవాలి.
 • అతి ముఖ్యంగా ప్యాసివ్ స్మోకింగ్ ను నివారించుకోవాలి. 
 • కుటుంబంలో క్యాన్సర్ ఆనవాళ్ళు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. 
 • కొంతమంది కర్మగారాల్లో పని చేస్తూ హానికరమైన కెమికల్స్ కి బహిర్గతం అవుతుంటారు. అలాంటి హానికరమైన కెమికల్స్ కి బహిర్గతం అవ్వకుండా జాగ్రత్త పడాలి. 
 • HIV ఇన్ఫెక్షన్స్ సోకకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి.  
 • కొన్ని రకాల చికిత్స లో భాగంగా రెడీయేషన్ కి గురౌతుంటారు. అలాంటి సమయాల్లో రేడియేషన్‌ను పరిమితం చేయాలి. 
 • అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. 
 • ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. 

 

కొలొరెక్టల్ క్యాన్సర్:

కొలొన్ అంటే పెద్ద ప్రేగు. కొలొరెక్టల్ క్యాన్సర్ అనేది పెద్దప్రేగు లేదా పురీషనాళంలోని కణాలు నియంత్రణ లేకుండా పెరగటం వల్ల ఏర్పడుతుంది. కొన్నిసార్లు దీనిని పెద్దప్రేగు క్యాన్సర్ అని కూడా అంటారు.

కొన్నిసార్లు పెద్దప్రేగు లేదా పురీషనాళంలో పాలిప్స్ అని పిలువబడే అసాధారణ కణతులు ఏర్పడతాయి. కాలక్రమేణా, కొన్ని పాలిప్స్ క్యాన్సర్‌గా మారే అవకాశం ఉండవచ్చు. స్క్రీనింగ్ పరీక్షల ద్వారా పాలిప్స్ ను  గుర్తించి, క్యాన్సర్‌గా అభివృద్ధి చెందడానికి ముందే వాటిని తొలగించవచ్చు. 

క్యాన్సర్ ను మొదటి దశలోనే గుర్తించి చికిత్సను ప్రారంభిస్తే చికిత్సలో మంచి ఫలితాలను పొందవచ్చు. ఆరోగ్యకరమైన జీవణ శైలిని జీవిస్తూ కొన్ని నివారణ చర్యలను తీసుకోవడం వల్ల కాస్త జాగ్రత్త పడవచ్చు. 

కొలొరెక్టల్ క్యాన్సర్ ను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 

 • శరీర బరువు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి.
 • ఈరోజుల్లో మనం జీవించే జీవణ శైలిలో నిత్యం ఒకే దగ్గర గంటల తరబడి కూర్చుంటున్నాము. అందువల్ల శారీరిక శ్రమ లేకుండా రకరకాల వ్యాధులకి గురౌతుంటాము. అలాకాకుండా వ్యాయామం చేస్తూ శారీరకంగా చురుకుగా ఉండటం వల్ల క్యాన్సర్ ను నివారించుకోడానికి సహయపడవచ్చు. 
 • పండ్లు మరియు కూరగాయలు అధికంగా ఉండే ఆహారం మరియు రెడ్ మీట్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. 
 • కొన్ని అధ్యయనాలు కాల్షియం మరియు విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకునే వ్యక్తులు కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తక్కువగా కలిగి ఉండవచ్చని సూచిస్తున్నారు. 

 

గర్భాశయ క్యాన్సర్:

ప్రపంచవ్యాప్తంగా, మహిళల్లో అత్యంత తరచుగా వచ్చే క్యాన్సర్లలో నాల్గవ స్థానంలో ఉంది గర్భాశయ క్యాన్సర్. గర్భాశయ క్యాన్సర్ అనేది గర్భాశయంలోని కణజాలాలలో మొదలయ్యే ఒక రకమైన క్యాన్సర్.

ఇది సాధారణంగా డైస్ప్లాసియా అనే పరిస్థితితో నెమ్మదిగా మొదలవుతుంది. గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణం కొన్ని రకాల హ్యూమన్ పాపిల్లోమా వైరస్(HPV). గర్భాశయ క్యాన్సర్ అనేది నివారించదగిన క్యాన్సర్లలో ఒకటి, దీనిని ముందుగానే గుర్తిస్తే చికిత్సలో మంచి ఫలితాన్ని పొందవచ్చు. 

గర్భాశయ క్యాన్సర్ ను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 

 • గర్భాశయ క్యాన్సర్‌ను తరచుగా స్క్రీనింగ్‌లు చేయడం ద్వారా క్యాన్సర్‌ ప్రమాదాన్ని ముందే కనిపెట్టి చికిత్స చేయడం ద్వారా నివారించవచ్చు. 
 • HPV వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా HPV వైరస్ వల్ల వచ్చే గర్భాశయ క్యాన్సర్‌ను నిరోధించడంలో సహాయపడుతుంది. 
 • లైంగిక భాగస్వాములను పరిమితం చేయాలి.
 • విపరీతమైన ధూమపానం మానుకోవాలి. 

 

అండాశయ క్యాన్సర్:

స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థలో రెండు అండాశయాలు ఉంటాయి. ఇవి  గర్భాశయం ఇరువైపుల ఉంటాయి. ఒక్కో అండాశయం బాదం పప్పు పరిమాణంలో ఉంటుంది.  ఇవి అండాశయాలను, ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. అండాశయాలలో ఏర్పడే క్యాన్సర్ ను అండాశయ క్యాన్సర్ అంటారు. అండాశయ క్యాన్సర్ మొదట సంభవించినప్పుడు గుర్తించదగిన లక్షణాలను కలిగి ఉండకపోవచ్చు. 

అండాశయ క్యాన్సర్ ను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 

దురదృష్టవశాత్తు, అండాశయ క్యాన్సర్ పూర్తిగా నిరోధించలేము. కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ,  అండాశయ  క్యాన్సర్ సోకకుండా జాగ్రత్తపడవచ్చు.  

బర్త్ కంట్రోల్ పిల్స్:

కనీసం ఐదు సంవత్సరాల పాటు బర్త్ కంట్రోల్ పిల్స్ ఉపయోగించిన మహిళలకు అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. 

తల్లిపాలు:

పాలిచ్చే తల్లులకు అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.

ఆరోగ్యకరమైన జీవనశైలి:

ఆరోగ్యకరమైన జీవనశైలి సమతుల్య ఆహారం తీసుకోవడం, తరచుగా వ్యాయామం చేయడం మరియు ధూమపానం చేయకపోవడం ద్వారా అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

 

ప్రమాదాన్ని తగ్గించే సర్జరీ: 

కుటుంబ చరిత్ర కారణంగా అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న మహిళలల్లో  అండాశయాలు మరియు ఫెలోపియన్ ట్యూబ్‌ల తొలగింపు వంటి ప్రక్రియల ద్వారా ప్రమాదాన్ని తగ్గించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. 

చివరగా, పైన ప్రస్తావించిన క్యాన్సర్లు మహిళల్లో అత్యంత సాధారణమైన క్యాన్సర్లు. శరీరంలో ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించి చికిత్సను ప్రారంభించాలి. ఎందుకంటే మొదటి దశలో క్యాన్సర్ ను గుర్తిస్తే చికిత్సలో మెరుగైన ఫలితాన్ని పొందవచ్చు. అలాగే ఈ నివారణ చర్యలు పాటిస్తూ క్యాన్సర్ ను తగ్గించే అవకాశాలను పెంచుకుంటూ ఆరోగ్యంగా జీవిద్దాం.