క్యాన్సర్ మన జీవితాల్లోకి రాకుండా ఉండాలంటే?

You are currently viewing క్యాన్సర్ మన జీవితాల్లోకి రాకుండా ఉండాలంటే?

ఐసీఏంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు చేసిన ఒక అధ్యయనం ప్రకారం  మన దేశంలో ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి వాళ్ళ జీవితకాలంలో(0-74 ఏళ్ల మధ్య) క్యాన్సర్ రిస్క్ ఉందని వారిచ్చిన నివేదికలో తెలిపారు.

క్యాన్సర్ ఎందుకింత తీవ్రంగా మారుతోందని పరిశీలించి చూస్తే అందుకు చాలానే కారణాలు ఉన్నాయన్న విషయం తేటతెల్లమవుతుంది. వాటిలో కొన్ని మన అలవాట్ల వలన సంభవిస్తే మరికొన్ని పర్యావరణంలో ఉండే కాలుష్యం వల్ల సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఇంకొన్ని జన్యుపరంగా రావచ్చు. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాన్సర్ ఫలానా కారణాల వలనే వస్తుందని చెప్పడం అసాధ్యం. అలాగే క్యాన్సర్‌ను పూర్తిగా నివారించడం కూడా సాధ్యపడదు కానీ కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే వీలైనంత వరకు క్యాన్సర్ దరిచేరకుండా నియంత్రించే అవకాశముంటుంది.

మన జీవనవిధానంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేయడం వలన కూడా క్యాన్సర్ రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. ఉదాహరణకి ఎండలో ఎక్కువగా తిరగకుండా ఉంటే స్కిన్ క్యాన్సర్ రిస్క్‌ తక్కువగా ఉంటుంది. ఇలా క్యాన్సర్ రిస్క్‌ను తగ్గించడానికి ఎన్నో మార్గాలున్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

క్యాన్సర్ రిస్క్ తగ్గించుకునే ప్రణాళిక: 

  1. ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు వెంట ఒక వాటర్ బాటిల్ తీసుకుని వెళ్తే మంచిది. రాగి బాటిల్ అయితే మరీ మంచిది. ప్లాస్టిక్ బాటిల్స్‌లో ఎక్కువగా  నీరు త్రాగితే BPA వంటి పదార్థాల ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. స్టీల్ బాటిల్ లేదా రాగి బాటిల్‌ను తీసుకువెళ్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.  అలాగే ఏదైనా హోటల్‌కు వెళ్ళినప్పుడు అక్కడ గ్లాసులు మూత పెట్టి ఉన్నాయా లేక తెరచి ఉన్నాయా గమనించాలి. ఒకవేళ తెరిచి ఉంచిన గ్లాసుల్లో నీళ్లు పెట్టినట్లయితే అందులో దుమ్ము ధూళి వంటివి ఉండే అవకాశం ఉంది. అందుకే వెళ్ళింది హోటల్‌కైనా అక్కడి నీళ్ళ కంటే ఇంటి నుంచి తీసుకుని వెళ్ళిన నీళ్ళకే ప్రాధాన్యత ఇచ్చినట్లయితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 
  2. చాలా వరకు మనలో ఉదయాన్నే కాఫీ లేదా టీ త్రాగే అలవాటు ఉంటుంది. మితంగా కాఫీ లేదా టీ త్రాగటం వల్ల ప్రమాదం లేదు, అలాగే రోజూ కెఫిన్ తీసుకోవటం వల్ల బ్రెయిన్ క్యాన్సర్,ఓరల్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాఫీ త్రాగితే మంచిది కదా అని నాలుగైదు కప్పులు తాగేయకండి. మితంగా ఉంటేనే మంచిది.
  3. డ్రై క్లీనింగ్ ను అవాయిడ్ చేయండి, ఎందుకంటే డ్రై క్లేనింగ్ చేసే సమయంలో ఉపయోగించే సాల్వెంట్ లో ఉండే  పెర్క్లోరోఎథైలీన్ లివర్ మరియు కిడ్నీ క్యాన్సర్లకు కారణం అవ్వచ్చట.వీటిని వేరే ప్రత్యమ్నాయలతో రిప్లేస్ చేయటం మంచిది.
  4. ఆహారంలో తప్పని సరిగా గ్రీన్స్ అంటే ఆకు కూరలు ఉండేలా చూసుకోండి, ఎక్కువగా క్లోరోఫిల్ ఉన్న వాటిలో మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది.  అలాగే ఇది మహిళల్లో కోలన్ క్యాన్సర్‌ను నివారిస్తుంది. ఒక అర కప్పు పాలకూరను ఉడికించి తిన్నట్లయితే అందులో 75 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుందట. ఇది మన రోజూ మెగ్నీషియం  అవసరాలలో ఇరవై శాతం వరకు కవర్ చేస్తుంది.
  5. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. దీనివల్ల రెండు రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయి. అందులో మొదటిది.. ఇలా చేయటం వల్ల ఇంట్లో దుమ్ము ధూళి వంటివి ఎక్కువగా ఉండి, మనం తినే ఆహారం లోకి, పీల్చే గాలిలోకి అవి వెళ్ళవు, ఇక రెండవది.. ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకుంటూ సర్దుతూ ఉండటం వల్ల ఈ పనిచేసే మహిళలకు కూడా ఇది ఒక వ్యాయామంలాగా మారి 30 శాతం వరకు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
  6. ఎండలో మరీ ఎక్కువగా తిరగకండి, దీనివల్ల స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది. ఎక్కువగా అల్ట్రా వాయిలేట్ కిరణాల వల్ల ఈ సమస్య వచ్చే రిస్క్ ఉంది. అందుకే వీలైనంత వరకు ఎక్కువ ఎండగా ఉన్న సమయంలో బయటకు వెళ్ళకుండా ఉంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకవేళ బయటకు వెళ్ళాల్సి వచ్చినా కూడా ముఖానికి సన్ స్క్రీన్ లోషన్ వంటివి అప్లై చేసుకుని వెళ్తే మంచిది. 
  7. ఒకవేళ అధిక బరువు ఉన్నట్లయితే బరువు తగ్గి సరైన బరువుకు రావటానికి ప్రయత్నం మొదలుపెట్టండి. బాడీ మాస్ ఇండెక్స్ చెక్ చేసుకోండి.సరైన బరువులో ఉండటం క్యాన్సర్‌తో సహా చాలా ఆరోగ్య సమస్యలనుండి రక్షిస్తుంది. మహిళల్లో ఇరవై శాతం, పురుషులలో పద్నాలుగు శాతం క్యాన్సర్ మరణాలు ఊబకాయం వల్లే సంభావిస్తున్నయట.
  8. ఒకవేళ కుటుంబ చరిత్రలో క్యాన్సర్ ఉంది ఉంటే మీ క్యాన్సర్ రిస్క్‌ను  తెలుసుకోవటానికి వైద్యుడిని సంప్రదించండి. వైద్యుల సూచనల మేరకు జన్యుపరీక్షలు నిర్వహించుకోండి. జీవనశైలిలో మార్పుల వల్ల క్యాన్సర్‌ను నివారించగలమైతే, సరైన సమయానికి గుర్తించి చికిత్స చేయటం వల్ల క్యాన్సర్‌ను  పూర్తిగా నయం చేసే అవకాశం కూడా ఉంది.
  9. రోజు కు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్ళు త్రాగండి, నీళ్ళు త్రాగటం వల్ల బ్లాడర్  క్యాన్సర్ కారకాలు మూత్రం ద్వారా వెళ్ళిపోయి, బ్లాడర్  క్యాన్సర్  రిస్క్‌ను తగ్గిస్తాయి.అందుకని నీళ్లు సరిపడా త్రాగటం ఎప్పుడూ మరచిపోకండి.
  10. సరైన ఆహారాన్నే ఎంచుకోండి, వీలైనంత వరకు పెస్టిసైడ్ అవశేషాలు లేని కూరగాయాలనే తీసుకోండి ఒకవేళ మీకు తెలియకపోతే కూరగాయలను శుభ్రంగా పైన ఉండే ఆ అవశేషాలు పూర్తిగా పోయేనటే వరకు ఉప్పునీటితో కడిగి ఉపయోగించండి. పోషకాలు ఉన్న ఆహారం ఎంత ముఖ్యమో, శుభ్రమైన ఆహారం కూడా అంతే ముఖ్యం.
  11. ధూమపానానికి దూరంగా ఉండండి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ధూమపానం అత్యంత ముఖ్యమైన క్యాన్సర్ కారణాలలో ఒకటి. ఎన్నో రకాల క్యాన్సర్‌ను ఈ వ్యసనానికి ముడిపడి ఉన్నాయి. అలాగే మద్యపానాన్ని కూడా మానేయటం మంచిది. ఈ రెండూ క్యాన్సర్ రిస్క్‌ను మరింత పెంచగలవు.
  12. శరీరానికి సరిపడా క్యాల్షియం రోజూ అందేలా చూడండి, పాలను త్రాగటం ద్వారా క్యాల్షియం లభిస్తుంది. సరైన క్యాల్షియం శరీరానికి అందితే కోలన్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందట.
  13. సరైన డైట్‌ను అనుసరించండి, ఆరోగ్యంగా ఉండటానికి ఏ పోషకాలు అవసరమో అవన్నీ ఆహారంలో భాగం అయ్యేలా చూసుకోండి. క్యాన్సర్ ఫైటింగ్ ఫుడ్స్‌ను డైట్‌లో ఉండేలా చూడండి. సరైన సమయానికి తగినంత ఆహారమే తిని ఆరోగ్యంగా ఉండటం వల్ల కూడా క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది.
  14. వ్యాయామం చేయండి, రోజుకు కనీసం ముప్పై నిముషాలు వ్యాయామం చేసిన వాళ్లకు క్యాన్సర్ రిస్క్ చాలా వరకు తగ్గుతుందట. సరైన వ్యాయమ దినచర్య తయారుచేసుకొని రోజూ వ్యాయామం చేస్తే చాలావరకు ఆరోగ్య సమస్యలను దూరం చేసినట్టే.
  15. మానసిక ఒత్తిడిని దూరం పెట్టండి, మానసిక ఒత్తిడి అనేది పరోక్షంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, ఒకానొక సమయంలో క్యాన్సర్‌కు కారణంగా కూడా మారవచ్చు. కాబట్టి ధ్యానం వంటి అలవాట్లు చేసుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలా చేసినట్లయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం.

చివరగా

క్యాన్సర్‌ను పూర్తిగా నివారించలేము కానీ నివారించే అవకాశం మన చేతుల్లోనే ఉంది. మన అలవాట్లను, జీవన విధానాన్ని మార్చుకోవటం వల్ల చాలావరకు క్యాన్సర్ ప్రమాదాన్ని  నివారించవచ్చు. ఇక్కడ సూచించిన ఈ మార్గాలు క్యాన్సర్‌ను నివారించడానికి ఎంతగానో సహాయపడగలవు. క్యాన్సర్ పట్ల అవగాహన మన అందరికీ అవసరమే. ఏదైనా సందేహం వచ్చినా లేక క్యాన్సర్ సంకేతాలు కనిపించినా వెంటనే ఆంకాలజీ నిపుణుడిని సంప్రదించాలి. తద్వారా నివారించలేని క్యాన్సర్లను కూడా సరైన సమయానికి గుర్తించినట్లయితే వెంటనే చికిత్స చేయడం ద్వారా తొందరగా బయటపడవచ్చు. 

Also Read: రసాయన ఆయుర్వేద చికిత్సకు సాధారణ ఆయుర్వేద చికిత్సకు వ్యత్యాసం ఏమిటి?

Disclaimer:

This information on this article is not intended to be a substitute for professional medical advice, diagnosis, treatment, or standard medicines. All content on this site contained through this Website is for general information purposes only.