హర్మోనల్ ఇంబ్యాలెన్స్ ను నివారించే 5 యోగా ఆసనాలు

You are currently viewing హర్మోనల్ ఇంబ్యాలెన్స్ ను నివారించే 5 యోగా ఆసనాలు

మన జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి మరియు ఆహారం, నిద్ర లేకపోవడం వల్ల మన శరీరంలో హార్మోనల్ ఇంబాలెన్స్ సమస్య కలుగుతుంది. శరీర పనితీరును నిర్వహించడానికి హార్మోన్ల సమతుల్యత చాలా ముఖ్యం. హార్మోనల్ ఇంబాలెన్స్ మన శరీర అవయవాల పనితీరును దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఇది శారీరక, మానసిక మరియు భావోద్వేగ మార్పులకు దారితీస్తుంది.

హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే ఏమిటి?

హార్మోన్లు అనేవి మన శరీరంలోని వివిధ గ్రంథులు ఉత్పత్తి చేసే రసాయనాలు. హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే శరీరంలో హార్మోన్ల ఉత్పత్తి నార్మల్ గా లేకపోవడం.

హార్మోనల్ ఇంబాలెన్స్  వల్ల కలిగే సమస్యలు:

 • ఇరెగ్యులర్ పీరియడ్స్
 • సంతానలేమి
 • మొటిమలు
 • మధుమేహం
 • థైరాయిడ్ వ్యాధి
 • ఊబకాయం
 • బరువు తగ్గటం. 

 ఈ సమస్యను సహజంగా అధిగమించాలి అంటే మన జీవణ శైలిలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం మరియు వ్యాయామం చేయడం. ముఖ్యంగా యోగా చేయడం వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ ను చాలా వరకు నివారించవచ్చు.

యోగా యొక్క ప్రాముఖ్యత:

యోగా అనేది సంస్కృత పదంలోని “యుజ్” నుండి వచ్చింది, దీని అర్థం “యూనియన్”. యోగా సాధనలో మన శరీరాన్ని మరియు మనస్సుని ఏకం చేయడం. యోగా అనేది ఒక జీవన విధానం, దీని లక్ష్యం ఆరోగ్యకరమైన శరీరం మరియు మనస్సును పొందటం. ఆయుర్వేదం ప్రకారం, యోగా వాత, పిత్త మరియు కఫా దోషాల మధ్య సమతుల్యతను పెంపొందించడంలో సహాయపడుతుంది. యోగా అనేది శరీరాన్ని మెలితిప్పడం, వంచడం మరియు శ్వాసపై దృష్టి పెట్టడం మాత్రమే కాదు. వాస్తవికతను చూడటానికి మరియు అనుభవించడానికి ఉపయోగపడే ఒక టెక్నిక్ కూడా. 

యోగా శారీరక ఆరోగ్యాన్ని పొందటంలో సహాయపడటమే కాకుండా  మానవ సంబంధాలను మెరుగుపరచుకోవడంలో కూడా సహాయపడుతుంది. ఎందుకంటే ఇది మనకి దయ, శ్రద్ద, కరుణ మరియు ప్రశాంతతను పొందే విధంగా మానసికంగా దోహదపడుతుంది. 

క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా, ఒక వ్యక్తి తన భావోద్వేగాలపై మంచి నియంత్రణను కలిగి ఉంటాడు. అంతేకాకుండా క్రమశిక్షణతో కూడిన సంతోషకరమైన జీవితాన్నికూడా గడపగలడు. ఇక శారీరికంగా ఇది  మనలో బలాన్ని మరియు ఓర్పును పెంచుతుంది. కండరాలను బలపరుస్తుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇలా ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. ముఖ్యంగా యోగా ని అనుసరిస్తూ హర్మోనల్ ఇంబ్యాలెన్స్ ను అవలీలగా వదిలించుకోవచ్చు.     

హర్మోనల్ ఇంబ్యాలెన్స్ ని నివారించడానికి ఉపయోగపడే యోగా పోసెస్:

మత్స్యాసనం:

మత్స్యాసనం అనేది ఒక ప్రసిద్ధమైన యోగ ఆసనం. మత్స్యాసనం అనే పదంలో మత్స్య అంటే సంస్కృతంలో చేప అని అర్థం. ఈ ఆసనంలో శరీర చివరి భంగిమ చేపను పోలి ఉంటుంది. అందువల్ల దీనికి “మత్స్యాసనం” అనే పేరు వచ్చింది. మత్స్యాసనాన్ని ఫిష్ పోస్ అని కూడా అంటారు.

ఎండోక్రైన్ గ్రంథులు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే అవి హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. శరీరం యొక్క సరైన పనితీరుకు హార్మోన్లు చాలా  అవసరం. మత్స్యాసనం చేయడం వల్ల ఎండోక్రైన్ గ్రంథులను మ్యానేజ్ చేయడానికి ప్రేరేపించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది పీనియల్ మరియు పిట్యూటరీ గ్రంథులను కూడా ప్రేరేపించడానికి సహయపడతాయి. ముఖ్యంగా ఈ పోస్ శరీర పనితీరును మెరుగుపరుస్తుంది. 

Matsyasana

మత్స్యాసనం చేసేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు:

 • మత్స్యాసనాన్ని మొదటిసారి చేస్తున్నట్లైతే యోగా నిపుణుడి పర్యవేక్షణలో చేయడం ఉత్తమం.   
 • రక్తపోటు తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ భంగిమను ప్రదర్శించకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
 • మోకాలి నొప్పి లేదా గాయం ఉంటే, ఈ భంగిమను నివారించాలి. ఎందుకంటే ఇది మోకాలి కండరాలలో నొప్పిని కలిగించవచ్చు.
 • పొత్తికడుపులో గాయం లేదా హెర్నియా ఉంటే ఈ భంగిమను ఆచరించవద్దు.

భుజంగాసనం:

Bhujangasana

భుజంగాసనం అనేది యోగాలో ఒక రకమైన ఆసనం. సంస్కృతంలో భుజంగ అంటే నాగుపాము అని అర్థం. ఈ ఆసనం వేసినప్పుడు శరీరం పడగ ఎత్తిన పాము లాగా ఉంటుంది. అందువల్ల దీనికి భుజంగాసనమని పేరు వచ్చింది.

భుజంగాసనం వేసేటప్పుడు మన శరీరం అంతా స్ట్రెచ్ అవుతుంది. ఇది అడ్రినల్ గ్రంధి మర్ధనాకి ప్రేరేపిస్తుంది. తద్వారా ఒత్తిడిని ఎదుర్కోడానికి మరియు ఒత్తిడిని విడుదల చేయడానికి సహాయపడుతుంది. PCOS సమస్యతో బాధపడే వారికి భుజంగాసనం చక్కగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఇది అండాశయాల పనితీరును కూడా ప్రేరేపిస్తుంది. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోడానికి కూడా ఈ ఆసనాన్ని ఎంపిక చేసుకోవచ్చు. 

భుజంగాసనం చేసేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు:

 • భుజంగాసనం చేసేటప్పుడు బాడీని స్టిఫ్ గా ఉంచకూడదు. 
 • గర్భిణీ స్త్రీలు ఈ పోస్ కి దూరంగా ఉండటం మంచిది. 
 • ఏదైనా అంతర్లీన స్థితితో బాధపడుతుంటే ఈ ఆసనాన్ని వేసేముందు యోగా నిపుణుడిని సంప్రదించండి.

సర్వంగాసనం:

సర్వంగాసనం సంస్కృత పదం “సర్వ్” నుండి వచ్చింది, దీని అర్థం “మొత్తం” మరియు “అంగ”, అంటే “శరీర భాగాలు”. సర్వంగాసన యోగాసనం అనేది తల నుండి కాలి వరకు మొత్తం శరీరం ప్రభావితమవుతుందని నమ్మే ఆసనాల్లో ఇది ఒకటి.

సర్వంగాసనం, ఎండోక్రైన్ గ్రంథులు, పిట్యూటరీ గ్రంథి, అడ్రినల్ గ్రంథులు, ప్యాంక్రియాస్ ను మెరుగుపరచడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. తద్వారా హార్మోన్ల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా ఇది జీర్ణాశయ సమస్యలు, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను కూడా తొలగించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే సర్వంగాసన సమయంలో విసెరల్ అవయవాలు మర్దనాని అందుకుంటాయి. 

Sarvangasana

సర్వంగాసనం చేసేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు:

సర్వంగాసనం చేసేటప్పుడు మోకాళ్లను వంచకూడదని నిపుణులు  సిఫార్సు చేస్తున్నారు.

గుండె సమస్యలు, గర్భం దరించినప్పుడు, స్లిప్ డిస్క్, సర్వైకల్ స్పాండిలోసిస్, తీవ్రమైన థైరాయిడ్ సమస్య, మెడ నొప్పి, రుతుక్రమం మరియు రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే యోగా నిపుణుల పర్యవేక్షణలో ఈ భంగిమను ప్రాక్టీస్ చేయడం ఉత్తమం. 

బాలాసనం :

Balasana

బాలాసనం, దీన్ని చైల్డ్ పోస్  అని కూడా పిలుస్తారు, బాలసనం ఒత్తిడిని తగ్గించడానికి మరియు నాడీ వ్యవస్థను శాంతపరచడానికి సహాయపడే భంగిమ. హార్మోన్ల అసమతుల్యతకు ప్రధాన కారణాలలో ఒత్తిడి ఒకటి. కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను ఉత్పత్తి చేసే అడ్రినల్ గ్రంధులను విశ్రాంత పరచడానికి బాలాసన సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించడం మరియు అడ్రినల్ గ్రంధులను సమతుల్యం చేయడం ద్వారా, ఈ ఆసనం హార్మోన్ల ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

బాలాసనం చేసేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు:

 • మోకాలికి ఏదైనా గాయాలు ఉంటే ఈ యోగాసనాన్ని చేయడం మానుకోవాలి. 
 • ఈ ఆసనాన్ని వేసేటప్పుడు నొప్పిని కలిగితే ప్రమాదాన్ని నివారించడానికి ఆపేయడం మంచిది. 

ఉస్ట్రాసనం: 

Ustrasana

ఉస్ట్రాసనం సంస్కృత పదం “ఉస్ట్రా” నుండి వచ్చింది. ఉస్ట్రా అంటే ఒంటె అని అర్ధం. ఉస్ట్రాసనం ఎండోక్రైన్ వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు సహాయపడుతుంది. శరీరం ముందు భాగాన్ని స్ట్రెచ్ చేయడం ద్వారా, ఈ ఆసనం థైరాయిడ్ మరియు పారాథైరాయిడ్ గ్రంధుల పనితీరును నియంత్రిస్తుంది. ఈ గ్రంథులు జీవక్రియను మరియు కాల్షియంని బ్యాలెన్స్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఉస్ట్రాసనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం వల్ల హర్మోనల్ ఇంబ్యాలెన్స్ ను అధిగమించడంలో  సహాయపడుతుంది.  

ఉస్ట్రాసనం చేసేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు:

 • గర్భిణీ స్త్రీలు, పిల్లలు మరియు వృద్ధులు ఈ ఆసనాన్ని వేసే  ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 
 • అనారోగ్యంతో లేదా వెన్నునొప్పి సమస్యతో బాధపడుతుంటే ఉస్ట్రాసనాన్ని నివారించడమే మంచిది. 
 • చాలా వేడి లేదా అతి శీతల వాతావరణం వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులలో, ఉస్ట్రాసనానికి దూరంగా ఉండాలని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

చాలామంది హర్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అనేకమైన సమస్యలను ఎదుర్కుంటున్నారు. అలాంటి వారికి ఈ యోగా ఆసనాలు చక్కగా సహాయపడతాయి. అందువల్ల ఈ ఆసనాలను క్రమంగా అనుసరిస్తూ హర్మోనల్ సమస్యలను నివారించుకోవచ్చు. యోగాతో కేవలం హర్మోనల్ ఇంబ్యాలెన్స్ మాత్రమే కాదు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు.